కర్నూలుకు వరాలు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ కోసం అవసరమైన భవనాలను కూడా చూశామని, వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ట్రిపుల్ ఐటీ పక్కనే ఉర్దూ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన  స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

 ఇచ్చిన మాటను తప్పే అలవాటు తనకు లేదన్నారు. కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో సామాజిక సాధికారిత మిషన్‌ను ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఆయన సామాజిక సాధికారిత మిషన్ అమలులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రసూతి, శిశు మరణాలు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కర్నూలు జిల్లాలోనే అధికంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా 0-14 సంవత్సరాలున్న పిల్లల్లో 13 శాతం మంది పాఠశాలలకు వెళ్లడం లేదన్నారు.

 

  అందువల్లే కర్నూలులో సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కర్నూలును మెగా సిటీగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం.. జిల్లాలో ఈ ఏడాది రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అనేక దేవాలయాలు ఉన్న జిల్లాలో మెగా టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు రాజధానికి కర్నూలు నుంచి ఆరు లేదా నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించామన్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటు కానుందని ప్రకటించారు.

 

 11 లక్షల ఎకరాలకు సాగునీరు

 జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాదిలో గాలేరు నగరి, హంద్రీ నీవా, గోరుకల్లు రిజర్వాయర్‌తో పాటు గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేసి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా జిల్లాలో 10 లక్షల నుంచి 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అవసరమైతే కాల్వలపై పడుకుంటానని, అధికారులను అప్రమత్తం చేసి పనులు చేయిస్తానన్నారు.

 

 పారిశ్రామికీకరణ దిశలో...

 అనేక రంగాల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా వెనుకబడి ఉందని సీఎం అన్నారు. అందువల్ల జిల్లాలో ఇప్పటికే సేకరించిన 30 వేల ఎకరాల్లో భారీగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రణాళిక రచించామన్నారు. ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల వాళ్లే కర్నూలుకు వచ్చే పరిస్థితి కల్పిస్తామన్నారు. నెడ్‌క్యాప్ ద్వారా 10 వేల ఎకరాల్లో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. 3 వేల ఎకరాల్లో డీఆర్‌డీవో యూనిటుతో పాటు వేయి ఎకరాల్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) ఏర్పాటు కానుందన్నారు. మరో 10 వేల ఎకరాల్లో సెయింట్ గోబెన్, జైన్ ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు పలు సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయని, కొలిమిగుండ్ల వద్ద సిమెంటు హబ్ ఏర్పాటు కానుందన్నారు. ఓర్వకల్లు వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు ఇప్పటికే 3 వేల ఎకరాలు కేటాయించామన్నారు. రెండో దశ రుణమాఫీని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు.

 

 హామీలన్నీ అమలవుతాయి  : డిప్యూటీ సీఎం కేఈ

 జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. చంద్రబాబుపై తమకు ఈ నమ్మకం ఉందన్నారు. ఎన్‌టీఆర్ హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు విన్నవించారు. ఇంకో 10 నుంచి 15 ఏళ్ల వరకూ టీడీపీనే అధికారంలో ఉంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఆకాశంలో చంద్రుడు 12 గంటలు ఉంటే.. మా చంద్రబాబు ప్రజల కోసం 24 గంటల పాటు శ్రమిస్తున్నారని కొనియాడారు.

 

 రాజధాని పోయిందన్న బాధ జిల్లా వాసుల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, కేఈ ప్రభాకర్, ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, పార్టీ నేతలు శిల్పా చక్రపాణి రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇరిగెల రాంపుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top