రాజధానికి అనువు.. కర్నూలు

రాజధానికి అనువు.. కర్నూలు


కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి



గలగలా పారే తుంభద్ర.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ... అందుబాటులో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు.. ఐటీకి అనువైన ప్రదేశం.. పారిశ్రామిక రంగానికి అనుకూల ప్రాంతం.. రైలు, రోడ్డు మార్గాలు.. రాజధానిగా ఎంపిక చేయడానికి కర్నూలుకు ఉన్న అనుకూలతలు ఇవి. 2-3 గంటల్లో హైదరాబాద్‌కు చేరుకోవడానికి వీలుగా హైవే ఉంది.



అటు బెంగుళూరుకూ సులభంగా చేరుకోవచ్చు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు రాజధాని కొలువుదీరిందీ కర్నూలులోనే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడానికి అన్ని రకాల అనుకూలతలు ఉన్నా... పాలకులు ఈ దిశగా ఆలోచన చేయడం లేదు.

 

వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. నగరం చుట్టూ మరో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండానే భూములు సేకరించడానికి అవకాశం ఉంది. అసలే లోటు బడ్జెట్‌తో ప్రయాణం మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడమే గగనం. భూముల సేకరణకూ నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తే.. ప్రభుత్వం మీద మోయలేని భారం పడుతుంది. ఈ నేపథ్యంలో.. అన్ని అనుకూలతలు ఉన్న కర్నూలును రాజధానిగా ఎంచుకుంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

3-4 గంటల్లో హైదరాబాద్‌కు

కర్నూలు నుంచి 2-3 గంటల వ్యవధిలో పాత రాజధాని హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య 6 లేన్ల రహదారి ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించుకొనే వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులను వాడుకోవడానికి వీలుంటుంది. హైదరాబాద్ సిటీలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే విమానాశ్రయం నుంచి నేరుగా కర్నూలు చేరుకోవచ్చు. రైల్లే మార్గం కూడా ఉంది. కర్నూలు నుంచి బెంగుళూరుకు వెళ్లడం కూడా సులభమే. ఫలితంగా ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు నుంచి ఐటీ పరిశ్రమను ఆకర్షించడానికి వీలవుతుంది. రెండు నగరాలకు మధ్యలో ఉంటుంది కాబట్టి అదనపు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న రోడ్లును 6 లేన్ల రహదారిగా విస్తరిస్తే.. తక్కువ సమయంలో కోస్తా జిల్లాల ప్రజలు కూడా కర్నూలు చేరుకోవడానికి అవకాశం ఉంది.

 

బాబూ.. ఏకపక్ష నిర్ణయాలొద్దు

నంద్యాల: రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, అందరి ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని కోసం కర్నూలులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఇలాంటి  ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ గతే పడుతుందని హెచ్చరించారు. ‘‘మా ఇష్టమొచ్చినట్లు మేము చేసుకుంటాం..

 

మీకు చేతనైందని మీరు చేసుకోండి’’ అని చంద్రబాబునాయుడు హెచ్చరిస్తున్నా ఆ పార్టీ నాయకులు నోరు ఎత్తకపోవడం బాధాకరమన్నారు. విజయవాడకు అన్ని ప్రాజెక్టులను తరలిస్తూ.. రాయలసీమకు సానుభూతి ప్రకటనలు కూడా చేయకపోవడం దారుణమన్నారు. ప్రతి జిల్లా వారు రాజధాని కావాలనుకుంటారని, తాను కూడా కుప్పంలో రాజధాని కావాలని కోరుకుంటానంటూ.. సీఎం మొసలి కన్నీరు కార్చడాన్ని సీమ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top