రేప్ కేసులో బతికున్నంత కాలం జైలుశిక్ష

రేప్ కేసులో బతికున్నంత కాలం జైలుశిక్ష - Sakshi


కర్నూలు లీగల్: నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. వారు బతికున్నంత కాలం జైలులో మగ్గాల్సిందేనని న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి ఆదేశిస్తూ అరుదైన తీర్పును బుధవారం వెలువరించారు. నిందితులకు యావజ్జీవంతో పాటు రూ.5.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. వివరాలివీ.. 2013 జూలైలో కర్నూలు నగరంలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదివే విద్యార్థిని(20) తన సొంతూరు కోలార్(కర్ణాటక) వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలకు ఆటో ఎక్కింది. ఆ ఆటో డ్రై వర్ మాదిగ రవికుమార్ అలియాస్ మట్టిగాడు, అతని మిత్రుడు కురువ శ్రీనివాసులు ఆమెను డోన్ వైపు తీసుకెళ్లారు. దౌర్జన్యంగా ఆమె వద్దనున్న బంగారు గొలుసును లాక్కుని, ఇనుపరాడ్డుతో గాయపరిచి అత్యాచారం చేసి పారిపోయారు.



దాదాపు 20 రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాధితురాలు ఉల్లిందకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే వేరే కేసుల్లో పట్టుబడిన నిందితులను యువతి గుర్తించగా అత్యాచారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వారిపై 366, 376(2)ఎం, 376(బి), 394 సెక్షన్ల కింద పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వారికి జీవితకాల(బతికినంత కాలం) కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.




రేపిస్టులకు న్యాయవాదుల సహాయ నిరాకరణ

అనేక మందిపై అత్యాచారాలకు పాల్పడిన నిందితుల తరఫున బెయిల్ దాఖలు చేయబోమని, వారి తరఫున వకల్తా పుచ్చుకోబోమని 2013లో కర్నూలు బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఆ తీర్మానం మేరకు న్యాయవాదులు ఎవరూ వారికి న్యాయ సహాయం అందించకపోగా న్యాయస్థానం వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఓ న్యాయవాదిని నియమించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top