ఇద్దరి ఉసురు తీసిన కేఎస్ ఆర్టీసీ బస్సు

ఇద్దరి ఉసురు తీసిన కేఎస్ ఆర్టీసీ బస్సు - Sakshi


అనంతపురం క్రైం : డ్రైవర్ కునుకుపాటుతో ఓ ఆర్టీసీ బస్సు ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో 22 మంది ప్రయాణికులను ఆస్పత్రిపాలు చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం... బెంగళూరు నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సు మంత్రాలయానికి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. అందులో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజాము 3.05 గంటలకు ఇస్కాన్ టెంపుల్ సమీపానికి వచ్చింది. ఆ సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ బసప్ప వలీధార్ కునుకుతీయడంతో బస్సు అదుపుతప్పింది.



డివైడర్‌ను దాటి అవతలకు వెళ్లి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనం డ్రైవర్, క్లీనర్ అందులోనే విరుక్కుపోయి మృతి చెందారు. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ప్రయాణికుల ప్రాణభయంతో కేకలు పెట్టారు. బస్సు కుదుపునకు ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీట్లలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప, ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.



ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాగేపల్లికి చెందిన ఐచర్ డ్రైవర్ రామాంజినప్ప (30), క్లీనర్ రమణ (26)ను వాహనంలో నుంచి బయటకు తీశారు. గాయపడిన ప్రయాణికులను  108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రయాణికులు ఈరన్న, ఆయన భార్య పార్వతి(కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు)ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



 గాయపడిన ప్రయాణికులు వీరే..

 బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో పూర్విక (బెంగళూరు), గౌరి (బెంగళూరు), రాజు (ఆదోని), జానకి (తుముకూరు), మునిస్వామి (ఎమ్మిగనూరు), విక్రత్ (రామదుర్గ), రామాచారి (మంత్రాలయం), మధు సుధీక్ రాజ్ (మైసూర్), కె.వి.రాజీవ్ (మైసూర్), ముబారక్ అలీ (బెంగళూరు), తీర్థయ్య గౌడ్ (బెంగళూరు), శ్రీనివాస్ (బెంగళూరు), మునిమ్మ (బెంగళూరు), అణ్ణమ్మ (బెంగళూరు), జయప్రకాష్ జేమ్స్‌బాండ్ (బెంగళూరు), ప్రకాష్ (బెంగళూరు), స్వామి జశ్వంత్ (బెంగళూరు), సుజాత (బెంగళూరు), లక్ష్మి (రామదుర్గ), జాఫర్ (ఎమ్మిగనూరు) ఉన్నారు.

 

 బస్సు డ్రైవర్ కునుకుపాటు వల్లే ప్రమాదం

 బస్సు డ్రైవర్ కునుకుపాటు వల్లే ప్రమాదం జరిగింది. బస్సులో 52 మంది ప్రయాణికుల మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. కానీ మరో 15 మందిని అదనంగా ఎ క్కించారు. డ్రైవర్ నిద్రలో తూగడం, సామర్థ్యానికి మంచి ప్రయాణికులు ఉండటంతో బస్సు అదుపుతప్పింది. -యు.నరసింగప్ప, ట్రాఫిక్ డీఎస్పీ, అనంతపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top