రేపటితో ఆపండి

రేపటితో ఆపండి


శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు ఆదేశం

 ఈ రెండు రోజుల్లోనూ గరిష్టంగా మూడు టీఎంసీలే వాడాలి

కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు పాతవే అమలవుతాయి

15న తాజా పరిస్థితిని సమీక్షిస్తామని సర్కారుకు లేఖ

నాగార్జున సాగర్‌లో ఉత్పత్తి అంశాన్ని ప్రస్తావించని బోర్డు

 

 సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం(2వ తేదీ) నాటికే పరిమితం చేయాలని, అప్పటివరకు గరిష్టంగా 3 టీఎంసీల నీటినే వాడుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. బుధ, గురువారాల్లో జరిగిన సమావేశాల్లో బోర్డు ప్రతిపాదించిన మధ్యేమార్గాన్నే అనుసరించాలని బోర్డు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పునరుద్ఘాటించింది. ఈ నెల 2 వరకే తమకు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుందని, తర్వాత శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండదని తెలంగాణ చీఫ్ ఇంజనీర్(ఈఎన్‌సీ) గతంలో చర్చల సందర్భంగా చెప్పారని, ఆ మేరకే ఆదేశాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని, నీటిమట్టం పడిపోతే తాగు, సాగునీటి సంక్షోభం వస్తుందని బోర్డు రాసిన లేఖలో పునరుద్ఘాటించింది. కాగా శ్రీశైలంలో నిలిపేసి రెండు మూడు రోజుల విరామం తర్వాత దిగువన నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చని సర్వ సభ్య సమావేశంలో సూచించిన బోర్డు ఈ ఉత్తర్వుల్లో మాత్రం ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

 

 ఉత్తర్వుల సారాంశం..: ‘‘బోర్డు భేటీలో రాష్ట్రాల వాదనలు విన్నాం. తెలంగాణ విద్యుదుత్పత్తి వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోందంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోట్ ఆధారంగా.. ప్రస్తుత పంట సీజన్ పూర్తయ్యే వరకు సాగునీటికి, తర్వాత తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ టీ సర్కారుకు అక్టోబర్ 21న బోర్డు లేఖ రాసింది. పంటల కోసం విద్యుదుత్పత్తి చేస్తున్నందున, సాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నట్లు భావించాలని టీ సర్కారు సమాధానమిచ్చింది. విద్యుదుత్పత్తిలో ఏపీ నుంచి తెలంగాణకు న్యాయమైన వాటా రావడం లేదని కూడా పేర్కొంది.  విద్యుత్ డిమాండ్ తీవ్రంగా ఉన్న నవంబర్ 2 వరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరముంటుందని తెలంగాణ ఈఎస్‌సీ తెలిపారు.

 

 తర్వాత సాగర్‌లో ఉత్పత్తి చేస్తామన్నారు. కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో వ్యవహరించి, ప్రస్తుత ప్రొటోకాల్స్‌ను గౌరవించాలి. రాష్ర్ట విభజన చట్టంలోనూ ఇది స్పష్టంగా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలనే అమలు చేయడానికి ఈ ఏడాది జూలై 10న జరిగిన బోర్డు తొలి సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకొని అవసరాల కోసం ఈ నెల 2 వరకు మాత్రమే తెలంగాణ రాష్ర్టం విద్యుదుత్పత్తి చేసుకోవచ్చని ఆదేశిస్తున్నాం. అదికూడా 3 టీఎంసీలకు మించకుండా నీటిని వినియోగించుకోవాలి. అవసరమైతే ఈ నెల 15న పరిస్థితిని సమీక్షిస్తాం’’ అని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్త పేరున ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు టీ సర్కార్ శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని యథాతథంగా కొనసాగిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top