అక్రమాలు మీకే చెల్లు

అక్రమాలు మీకే చెల్లు - Sakshi


కర్నూలు(ఓల్డ్‌సిటీ): అక్రమాలకు పాల్పడటం కేఈ సోదరులకే చెల్లు అని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక కళావెంకట్రావ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నాడని ఇటీవల టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈనెల 26న కేడీసీసీ బ్యాంకు సమావేశంలో మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ చైర్‌పర్సన్ కుర్చీలో కూర్చోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 

కేఈ సోదరులు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో మైన్స్ పరిశ్రమల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ పట్టా భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్న కేఈ సోదరులపై వ్యాఖ్యానిస్తే ఖండించేందుకు సోమిశెట్టి ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు.



కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి శ్రీదేవిని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇద్దరు ఎస్పీలు క్లీన్‌చిట్ ఇచ్చినా చెరుకులపాడు నారాయణరెడ్డిపై పాత కేసులను తిరగదోడే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఏడాదికాలం పనిచేసినా జిల్లాకు ఎంతో మేలు చేకూర్చారన్నారు.

 

కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా గౌరవం నిలుపుకోకుండా రౌడీయిజం ప్రదర్శించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేలా మాట్లాడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి కోట్ల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, నాయకులు సర్దార్ బుచ్చిబాబు, ఎం.పి.తిప్పన్న, వై.వి.రమణ, ఎస్.ఖలీల్‌బాష, చెరుకులపాడు నారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అహ్మద్‌అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top