‘కూతవేటు’ దూరంలో కోటిపల్లి-నర్సాపురం లైన్!


 అమలాపురం :తమ గడ్డపై రైళ్లు నడిచే రోజు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కోనసీమవాసులకు ఒకింత కమ్మని కబురు అందింది. పచ్చని కొబ్బరితోటల నడుమ నుంచి ‘చుక్..చుక్..’మంటూ రైలుకూత వినిపించే సమయం కూతవేటు దూరంలోనే ఉందనిపించి సంతోషాన్ని కలిగించింది. గతంలోనే ఈ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించినా, రైల్వేబడ్జెట్‌కు ముందు దీని నిర్మాణంపై ఆరా తీయడం, సానుకూలంగా స్పందించడమే అందుకు కారణం.

 

 ఢిల్లీలో బుధవారం సమావేశమైన రైల్వే సాంకేతిక కమిటీ రాష్ట్రంలో విశాఖ రైల్వేజోన్‌తోపాటు కాకినాడ - కోటిపల్లి రైల్వేలైన్‌ను కోనసీమ మీదుగా నర్సాపురం వరకు పెంచే ప్రతిపాదనపై కూడా చర్చించి సానుకూలంగా స్పందించింది. దీనితో వచ్చే రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి -నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారనే నమ్మకం కోనసీమవాసుల్లో ఏర్పడింది. రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా స్పందించడంపై అమలాపురంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రైల్వే శంకుస్థాపన శిలాఫలకం వద్ద, స్థానిక గడియారస్తంభం సెంటర్లో కోనసీమ రైల్వే సాధన సమితి, కోనసీమ రైల్వే యువ సాధన సమితి, కోనసీమ జేఏసీల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. శిలాఫలకాన్ని కడిగి శుభ్రం చేయడంతోపాటు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

 

 భారీగా నిధులు ఇవ్వొచ్చు :ఎంపీ రవీంద్రబాబు

  కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని అమలాపురం ఎంపీ  పండుల రవీంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రైల్వేబడ్జెట్‌లో ఈ లైను నిర్మాణానికి తగిన నిధులు కేటాయించేందుకు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు అంగీకరించారన్నారు. బడ్జెట్‌లో భారీగా నిధులు మంజూరు కావచ్చని, ఈ ఏడాది పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. రైల్వేమంత్రితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top