కొండపల్లి కోటకు కోట్లు!

కొండపల్లి కోటకు కోట్లు!


విజయవాడ: నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన విజయవాడకు పర్యాటక సొబగులద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరంతోపాటు పరిసర ప్రాంతాలు, జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నింటినీ అభివృద్ధి చేసి విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పర్యాటక ఉత్సవాల్ని నగరంలోని కృష్ణా నదీ తీరంలో ఉన్న బెరంపార్కులో భారీగా నిర్వహిస్తున్నారు. తొలుత ఈ ఉత్సవాల్ని విశాఖలో నిర్వహించాలనుకున్నా ప్రభుత్వ ఆదేశాలతో రాజధానికి మార్చారు.



కొండపల్లి ఖిల్లాలో లైట్ అండ్ సౌండ్ షో

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట తరహాలో విజయవాడకు దగ్గర్లో ఉన్న కొండపల్లి ఖిల్లాలో లైట్ అండ్ సౌండ్ షోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.1.5 కోట్లు విడుదల చేసింది. రెడ్డి రాజులు నిర్మించిన ఈ ఖిల్లాలోని ప్రదేశాలకు ప్రచారం కల్పించి పర్యాటకులకు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడే అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల స్టాల్స్‌నూ పెట్టాలని యోచిస్తున్నా రు. నగరంలోనే ఉన్న ప్రతిష్టాత్మకమైన గాంధీహిల్‌ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.



500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై ఉన్న 52 అడుగుల గాంధీస్తూపం, గాంధీ రచనలు, బోధనలతో కూడిన వందలాది పుస్తకాల లైబ్రరీ, గాంధీ మెమోరియల్, ప్లానిటోరియంను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. బందరు రోడ్డులోని విక్టోరియా జూబ్లీ మ్యూజియం ఆధునీకరణ పనులను పూర్తి చేసి త్వరలో పునఃప్రారంభించనున్నారు. హిందూ, బౌద్ధ మతాలకు చెందిన వివరాలతోపాటు 2, 3వ శతాబ్దాల నాటి కళాఖండాలు, చిత్రాలు, వస్తువులు, ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఆధునీకరణ తర్వాత ఇది రాష్ట్ర స్థాయి మ్యూజియంగా మారుతుందని చెబుతున్నారు.



రూ.50 కోట్లతో మెగా టూరిస్టు సర్క్యూట్

కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే 70 కిలోమీటర్ల మెగా టూరిస్టు సర్క్యూట్‌కు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. విజయవాడ నుంచి కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం వరకూ దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నగరం నుంచి మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్, కూచిపూడిలోని సిద్ధేంధ్ర కళాపీఠం, శ్రీకాకుళంలోని ఆంధ్రమహా విష్ణువు దేవాలయం, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం మీదుగా హంసలదీవి వరకూ దీన్ని రూపొం దిస్తున్నారు. కూచిపూడి క్షేత్రాన్ని అంతర్జాతీయ టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. మిగిలిన వాటినీ సర్క్యూట్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.



కృష్ణా తీరానికి అందమైన రూపు

బెజవాడలో కృష్ణా నదీ తీరాన్ని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని సింగపూర్‌లోని సెంటోసా ద్వీపంలా తయారు చేయడానికి అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లను సంప్రదిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఏటా ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. దుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజీ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top