ఏం చేశారో!


ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే

 వచ్చే నెల 3, 4 తేదీల్లో  ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష

 జిల్లా నాయకులు,

 కార్యకర్తలు తరలి రావాలి

 ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ

 జిల్లా అధ్యక్షుడు

 కోలగట్ల వీరభద్రస్వామి


 

 విజయనగరం మున్సిపాలిటీ: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తున్నామని పలువురు రాష్ట్ర మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు వారేం చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. ఎన్నికలకు  ముందు అమలుకు వీలుకాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఆ హమీలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాలన  ప్రారంభించిన ఏడాది కాలంలో  ఇప్పటికీ మోసపూరితంగానే నడుచుకుంటోందని మండిపడ్డారు.

 

  ఈనేపథ్యంలో బాధ్యతల గల ప్రతిపక్ష  నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 3, 4 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో సమరదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.  ఈ దీక్షకు జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులు, అన్ని స్థాయిల్లో నియామకమైన నాయకులు,  కార్యకర్తలు తరలి వచ్చి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో  పూర్తిగా విఫలమయ్యారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో  ఏం జరుగుతోందో ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స.సాంబశివరాజు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పలు రకాలు హమీలు చేసి వాటిని అమలు చేయడంలో మాయమాటలు చెబుతూ నెట్టుకొస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ పెనుమత్స.సురేష్‌బాబు,   కేవీ.సూర్యనారాయణరాజు, చనమల్లు. వెంకటరమణ, పతివాడ.అప్పలనాయుడు, పీరు బండి. జైహింద్‌కుమార్ తదితరులు పాల్గొ న్నారు.

 

 29న జిల్లా పార్టీ సమావేశం


 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశాన్ని ఈనెల 29వ తేదీన సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని హోటల్ మయూరాలో నిర్వహిస్తున్నట్లు కోలగట్ల.వీరభద్రస్వామి ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, మండల కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top