మోసం ఆయన నైజం

మోసం ఆయన నైజం - Sakshi


 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం ఆయన  నైజమని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నిప్పులు చెరిగారు.  ప్రభుత్వం  అనుసరిస్తున్న మోసపూరిత తీరును నిరసిస్తూ ... రైతుల పక్షాన నిలబడి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో  శనివారం  చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు.  హామీలిచ్చి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు.  ముఖ్యంగా రైతులకు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ జరగ లేదు సరికదా వడ్డీ రాయితీని, పంటల  బీమాను  రైతులు కోల్పోయారని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చని, 30ఏళ్లు పాటు ఈ రాష్ట్రానికి సేవలందిస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారే తప్ప మామను వెన్నుపోటు పొడిచినట్టుగా  ప్రజల్ని వెన్నుపొడిచి అధికారంలోకి వస్తామని అనలేదన్నారు. వెన్నుపోటు పొడటంలో చంద్రబాబు దిట్టని, రైతులకు, డ్వాక్రా మహిళలకు చేసిందదేనని దుయ్యబట్టారు.

 

 ఎంతసేపు జగన్‌పై ఈ కేసులు, ఆ కేసులున్నాయని చెబుతూ కాలంగడుపుతున్నారని, అలాకాకుండా   తన  కేసులపై తెచ్చుకున్న స్టేలను ఎత్తివేయించుకుని, విచారణ జరిపించుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. రాజకీయ దురద్దేశంతో కాంగ్రెస్ పెట్టిన కేసుల్ని పట్టుకుని చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. మారాను..మారాను అంటే అందరూ నమ్మారని, తీరా ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేసే వాడిగా మారారన్న విషయం అర్థమయ్యిందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలను తీసేసి చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నిత్యం ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజాభిమానంతోనే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 రైతు దీక్ష శిబిరంలో  బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి,  వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్‌సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జులు కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శులు పరీక్షిత్‌రాజు, ఎస్. బంగారునాయుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములనాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ చలమల రమణ, తదతర నాయకులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top