ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం


  • ఎర్రచందనం అడ్డుకట్టకు తొలి ప్రాధాన్యత

  •  మరింత పటిష్టంగా డయల్ యువర్ ఎస్పీ

  •  కౌంటర్ కేసుల్లో విచారణ పటిష్టంగా  ఉండాలి

  •  జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్

  • పలమనేరు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా శుక్రవారం ఆయన పలమనేరులోని అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. తాను జిల్లా ఎస్పీగా కొత్తగా విధుల్లో చేరినందున పోలీస్‌స్టేషన్లు, సిబ్బందితో పరిచయం కోసం జిల్లా మొత్తం తిరుగుతున్నట్టు తెలిపారు. అందరూ నాకెందుకులే అనుకోకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు.



    లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ అయ్యే ప్రసక్తే లేదన్నారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో క్రైమ్ వివరాలను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై జిల్లాలోని సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామన్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందిని పూర్తిగా తగ్గించేందుకు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు.



    అందుకే తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు డ్రైవర్లలో  చైతన్యం తీసుకొస్తామన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం ఉండాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద సమాచారం ఉందని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు కర్ణాటక, అటు తమిళనాడుకు ఎర్రచందనం తరలకుండా పూర్తి స్థాయి లో నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. తమ ముందున్న సవాళ్లలో మొదటి ప్రాధాన్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడమేనన్నారు.



    భవిష్యత్తులో సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్ తదితరాలకు స్థలాల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే జిల్లాలోని పోలీస్ ఆస్తులను ఈ అవసరాల కోసం ఉపయోగించుకునేలా పథకం సిద్ధం చేశామన్నారు. ఇక కౌంటర్ కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసుల విచారణ పటిష్టంగా ఉండాలన్నారు. ఎవరు ఫిర్యాదు ఇచ్చినా దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో)పై ఉంటుందన్నారు.



    అయితే విచారణలో తప్పుడు కేసులను రెఫర్ చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి కేసులను తాము 98 వరకు గుర్తించి వాటిని రెఫర్ చేశామని పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమ్నాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. గత ఎస్పీ ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ వెంట పలమనేరు, గంగవరం సీఐలు బాలయ్య, రామక్రిష్ణ, ఎస్‌ఐలు రవినాయక్ తదితరులు ఉన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top