తమ్ముడే కాలయముడు

తమ్ముడే కాలయముడు - Sakshi

  • జీడి పిక్కల విషయమై వివాదం

  •  అన్నను  నరికి చంపిన కసాయి

  •  నిందితుడు పరారీ

  •  నాతవరం , న్యూస్‌లైన్ : ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. అన్నను సొంత తమ్ముడే కత్తితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన గ్రామంలో సంచలనమైంది. మండలంలోని మాధవనగరం గ్రామానికి చెందిన జాలెం కన్నయ్యమ్మ, రాజు దంపతులకు ఐదుగురు మగసంతానం. వీరిలో పెద్ద కుమారుడు, ఆఖరి కుమారుడు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు.



    రెండో కుమారుడైన చంటి, మూడో కుమారుడైన అప్పారావు, నాలుగోవాడైన కొండబాబు తల్లితో కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఐదు కిలోల జీడిపిక్కల విక్రయం విషయమై చంటి, అప్పారావు మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొండబాబు వీరిద్దరినీ విడదీసి శాంతింపజేశారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాత్రి 9గంటల సమయానికి చంటి ఇంటికి చేరుకున్నాడు.



    అప్పటికే ఇంటి వద్ద మాటు వేసి ఉన్న అప్పారావు అన్నయ్య చంటిపై కత్తితో దాడిచేసి ఒక కాలిపై నరికాడు. వెంటనే కింద పడిపోయిన చంటి మెడపై మరోసారి నరకడంతో అతడు అక్కకక్కడే కుప్పకూలిపోయాడు. ఇంటి సమీపంలో ఉన్న మరొక తమ్ముడు కొండబాబు వచ్చి చూసేసరికి అప్పటికే చంటి రక్తపుమడుగులో పడి కన్నుమూశాడు. దీంతో కొండబాబు పెద్ద కేకలు వేయడంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు వచ్చారు.



    అప్పటికే అప్పారావు కత్తి పట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి పరారయ్యాడు.  ఈ సంఘటనపై మృతుడి అన్నయ్య రాంబాబు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏఎస్పీ విశాల్‌గున్ని, రూరల్ సీఐ దాశరథి, ఎస్‌ఐ పి.రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య గతంలోనే మృతిచెందగా తండ్రి హత్యతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలుగా మిగిలారు.

     

    మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, కేసు విచారిస్తున్నట్టు ఏఎస్పీ విలేకరులకు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top