క్రీడలతో వేసవి సెలవుల సందడి


విజయనగరం అర్బన్‌: వేసవి కాలం వచ్చేసింది... మరో 20 రోజుల్లో విద్యార్ధులకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి... ఇక సమ్మర్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొందరేమో బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లినా ఎక్కవ రోజులు ఊర్లలోనే ఉంటారు. ఇళ్లలోనే ఉన్న విద్యార్ధులకు స్థానికంగా ఉన్న క్రీడామైదానాల్లోనూ, ఇండోర్‌లోనూ క్రీడలు ఆడుకోవడానికి సిద్దమవుతున్నారు. ఇక.. క్రీడా పరికరాల దుకాణాల్లో అయితే కనిపిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. పరికరాలు కొనుగోలు చేస్తున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పట్టణాలల్లో క్రీడా సామగ్రి లభించే దుకాణాలు ఉన్నాయి. ఖరీదు ఎంతైనా తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ చిన్నారులు ఎంజాయ్‌లో మునిగి తేలు తున్నారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్యారమ్, హాకీ, షటిల్‌ తదిరతాలపై మక్కువ చూపుతున్నారు. మార్కెట్లలో లభిస్తున్న క్రీడాపరికరాలు... వాటి ధరలు... ప్రయోజనాలపై కథనం.



చదరంగం:

జిల్లాలో చెస్‌ (చదరంగ)కు మంచి ఆదరణ ఉంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి చెస్‌ ఎంతో దోహదపడుతుంది. చెస్‌ బోర్డు రూ.55 నుంచి రూ.700 వరకు ధరలలో లభిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని ఈ ఆట ఆడుకోవచ్చు. మెదడుకు మేత చదరంగం ఆట. పిల్లలకు ఈ క్రీడ అలవరిస్తే చదువులో కూడా ఎంతో రాణించే అవకాశాలున్నాయి.



స్విమ్మింగ్‌ క్రీడలు:

వేసవిలో స్విమ్మింగ్‌ (ఈత)కు విద్యార్ధులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. పట్టణంలోని కంటోన్మెంట్‌లో ఆక్వా స్విమ్మింగ్‌ శిక్షణా కేంద్రం ఉంది. స్విమ్మింగ్‌ తెలిసనివారు, నేర్చుకోవాలనుకున్నవారు ఫీజు కాకుండా దుస్తులు, ఇతర వాటిని కొనుగోలు చేయక తప్పదు. గాగుల్స్‌ (కంటి అద్దాలు) రూ.70 నుంచి రూ.250, క్యాష్‌ నిక్కర్‌ రూ.80 వరకు ధరలలో అమ్మకాలు చేస్తున్నారు.



బాక్సింగ్‌....:

బాక్సింగ్‌ క్రీడ అరుదుగా ఆడుతుంటారు. కానీ ఇటీవల జిల్లా కేంద్రం నుంచి బాక్సింగ్‌ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులు పలు పతకాలు సాధిస్తున్నారు. బాక్సింగ్‌ను నవతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన దుస్తులు, సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. కిట్‌ బ్యాగ్‌ (ఇసుక నింపినన సంచి) రూ.180 నుంచి రూ.600, గ్లౌజెస్‌ రూ.350, బ్యాండేజ్‌ రూ.120 ధరల్లో లభిస్తున్నారు.



క్రికెట్‌.... క్రేజీ:

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ క్రేజీ కొనసాగుతోంది... క్రికెట్‌ అంటేనే నేటితరం విద్యార్ధులు, యువకులు వెర్రెత్తి పోతున్నారు. క్రికెట్‌ క్రీడ నగరాల నుంచి గ్రామాలకు పాకింది. ఇంకేముంది సెలవులు రావడంతో ఉదయాన్నే చిన్నారులు బ్యాట్‌లు, బాలు చేతబట్టి మైదానాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే... ఈ ఆట ఆడాలంటే క్రికెట్‌ సామగ్రి సొంతంగా అవసరం తప్పదు. రూ.250 మొదలుకుని రూ.4 వేలు వరకు క్రికెట్‌ బ్యాబ్‌ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బీడీఎం, ఎస్‌జీ, ఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్, కోకో బుర్రా తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. రూ.150 నుంచి రూ.600 వరకు పీస్‌ బాల్‌ అమ్ముతున్నారు. స్టంప్స్, బాల్స్, బ్యాట్, గ్లౌవ్స్‌ అన్ని కలుపుకుని రూ.14 వేల వరకు ధరల్లో లభిస్తున్నాయి.



ఫుట్‌బాల్‌....:

ఫుట్‌బాల్‌ క్రీడతో ఎక్కువ కిలోక్యాలరీల శక్తి ఖర్చవుతుంది. రోజూ గంటపాటు సాధన చేస్తే 150 నుంచి 200 కిలో కేలరీలు ఖర్చవుతాయి. రూ.100 నుంచి రూ.1,700 వరకు విలువు చేసే నివై, కాస్కో, విక్సన్‌ రకాల కంపెనీల పుట్‌బాల్‌లు లభిస్తున్నాయి.



క్యారమ్‌ బోర్టు!

క్యారమ్‌ బోర్డు క్రీడ ఇంట్లో కూర్చురి ఆడే ఆట. పిల్లలు, పెద్దలు ఈ ఆట ఆడడం సహజం. చాకచక్యంగా, సమయస్పూర్ధితో ఆడే ఆట ఇది. అయితే.... ప్రస్తుతం క్యారమ్‌ బోర్టులు దుకాణాల్లో రూ.400 నుంచి రూ.5,000 వేలు వరకు ఉన్నాయి.



వాలీబాల్‌... ఓ మంచి వ్యాయామ క్రీడ:

వాలీబాల్‌ మంచి వ్యాయామ క్రీడ. బాగా ఎత్తులో ఉండేవారికి ఈ క్రీడ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వాలీబాల్‌ ధరలు రూ.300 నుంచి రూ.1,500 వరకు విలువు విలువ చేసే కాస్కో, నివై, ఆష్టో, విక్సన్‌ తదితర కంపెనీల వాలీబాల్‌లు అందుబాటులో ఉన్నాయి. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌ బాల్‌ ధరలు ఆయా కంపెనీల ఆధారంగా రూ.220 నుంచి రూ.700 వరకు ఉన్నాయి.



జాతీయ క్రీడ... హాకీ:

జాతీయ క్రీడ హాకీ క్రీడపై ఎక్కువ మందికి మక్కువ లేకపోయినా జిల్లాలో ఈ క్రీడ మనుగడలో ఉంది. ఈ క్రీడలో కండరాలు బలంగా తయారవుతాయి. హాకీ స్టిక్స్‌ రూ.75 నుంచి రూ.1,500 వరకు విలువ చేసేవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.



షటిల్‌బాడ్మెంటన్‌...:

షటిల్‌ అన్ని రకాల వయస్సుగల వారు ఆడుకునే క్రీడ ఇది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీపీ, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు ఈ క్రీడ మంచి చేస్తుంది. సాధారణంగా ఫటిల్‌ ఆడే వారి బ్యాట్‌ ధర రూ.50 నుంచి టోర్నమెంట్‌ ఆదే క్రీడాకారుల బ్యాట్‌ల ధరలు రూ. 17 వేల వరకు ఉన్నాయి. యోనెక్స్, లెనిన్, కామాక్షి, క్యూకీ, మాక్స్‌ప్రో, యాంగ్‌ తదితర రకాల మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.



వైకుంఠపాలి...:

ఇంట్లో పిల్లలు, పెద్దలు కలిసి ఆడే ఆట వైకుంఠపాలి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడేవారు. ఇప్పుడు మళ్లీ ఈ ఆటకు ఆదరణ ఇటీవల పెరిగింది. నిచ్చెన, పాములు ఉండే ఈ ఆటను ఆడడం చాలా సరదాగా ఉంటుంది. గవ్వలతో ఆడుతారు. ఎన్ని గవ్వలు పడితే అన్ని గడులు దాల్సి ఉంటుంది. అందులో నిచ్చెన వస్తే పైకి వెళ్లడం, పాములు వస్తే కిందకు దిగడం జరుగుతుంది. ఆట మొత్తంలో ఎవరు వైకుంఠానిఇక చేరుతారో వారే విజేతలన్న మాట. ఈ క్రీడ ఆడే వైకుంఠ పటం రూ.40 నుంచి రూ.250 వరకు లభిస్తున్నాయి.



ఆత్మ రక్షణకు కరాటే...:

కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్ధినులు కరాటే నేర్చుకోవడం ఎంతో మేలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే... వేసవిలో విద్యార్ధలు కరాటే నేర్చుకోవడానికి అవసరమైన డ్రెస్‌లు రూ.300, నాన్‌చాక్‌కు రూ.60 నుంచి రూ.120 వరకు దరల్లో లభిస్తున్నాయి. జిల్లాలో వేసవి శిక్షణ కేంద్రాలు కూడా వెలిశాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top