ఖరీఫ్ కటీఫ్ !


సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోవడంతో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఏడాది పూర్తిగా నష్టపోయిన రైతుకు ఈ ఏడాది మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకూ గత రెండు నెలల్లో పడాల్సిన వర్షపాతం కంటే 45 శాతం తక్కువ నమోదైంది. ఈ నెలలో పడాల్సిన వర్షపాతంతో పోలిస్తే 85 శాతం తక్కువ వర్షం కురిసింది. ఒకవైపు వర్షాలు  లేకపోవడంతోపాటు ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కూడా నీటిమట్టాలు అడుగంటుతుండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.



కర్ణాటక, మహారాష్ట్రలో కూడా అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఇప్పట్లో ప్రాజెక్టుల్లో నీరు నిండే పరిస్థితి లేదు. ఇదే జరిగితే పశ్చిమ డెల్టాతో పాటు, నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టు కింద ఉన్న పంట ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఎక్కడ చూసినా పచ్చగా ఉండాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సరైన వర్షాలు పడితే పంటలు సాగు చేయటానికి దుక్కులు దున్ని అదునుకు సిద్ధం చేసిన పొలాలు ప్రస్తుతం బీడు భూములుగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటాయి.



జూన్‌లో కొద్దిపాటి వర్షాలు పడినా అవి భూమిలో ఇంకిపోయాయి. చెరువుల్లో నీటిమట్టం ఎక్కడా పెరగలేదు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవు. దీంతో చెరువుల కింద ఉన్న మాగాణి భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేసే అవకాశం కనపడటం లేదు. ఖరీఫ్ అదును దాటకముందే వర్షాలు పడాలని దేవుడిని వేడుకోవడం మినహా రైతుకు మరో దిక్కు కనపడటం లేదు. ఖరీఫ్‌లో జిల్లాలో 2,48,370 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా జూలై నెల సగం దాటిపోయిన తర్వాత కూడా 24 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు.



అయితే వాస్తవంగా ఇందులో సగం కూడా వేయలేదని రైతు నాయకులు చెబుతున్నారు.  కృష్ణాడెల్టా కాల్వల పరిధిలో మాత్రమే ఎంతో కొంత వరి వేసే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్ కావడంతో ఇంకా నారుమళ్లు కూడా వేయలేదు. పైన పడే వర్షాలు, డెల్టాకు నీటి విడుదల చూసిన తర్వాత నారుమళ్లు వేద్దామనే ఉద్దేశంలో రైతన్న ఉన్నాడు. గత ఏడాది ఖరీఫ్, రబీలలో రైతాంగం పూర్తిగా నష్టపోయింది.



 గత ఏడాది పరిస్థితి ఇదీ...

 గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ చూస్తే  -47.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  దీంతో ఉద్యాన వన పంటలైన బత్తాయి, నిమ్మ దారుణంగా దెబ్బతిన్నాయి.  జిల్లాలో 56 మండలాలకు గాను 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. కేవలం యద్దనపూడి, ఉలవపాడు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.



  వరి విషయానికి వస్తే 5,25,393 టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా 4,83,938 టన్నుల ఉత్పత్తి వచ్చింది. దీని ద్వారా కనీసం రూ.58 కోట్ల నష్టం వాటిల్లింది.



  శనగ పంట దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది. తద్వారా రూ.224 కోట్ల నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. వేరుశనగ కూడా దెబ్బతింది.



  మరోవైపు పొగాకు రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. పండిన పంటలో 30 శాతం కూడా కొనుగోలు జరగలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండగా, వచ్చే ఏడాది విస్తీర్ణం తగ్గించాలన్న పొగాకు బోర్డు నిర్ణయంతో రైతులు మరింత నష్టపోనున్నారు.  గత ఏడాది అన్ని పంటలు కలిపి 63,619 ఎకరాల్లో సాగు తగ్గింది. సుమారు 12 శాతం పంట దిగుబడి తగ్గిందని అంచనా. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద గత ఏడాది నీరు అందక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరి పొలాలకు నీరు అందలేదు. దీంతో చివరి భూముల్లో పంట బాగా దెబ్బతింది. ఈ ఏడాదీ వర్షాభావ పరిస్థితులు వెన్నాడుతుండటంతో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top