ప్రజలకు అండగా ఉండండి


ప్రగడకు జగన్ సూచన

ఆందోళనలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టీకరణ


 

యలమంచిలి: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల కారణంగా ఇబ్బంది పడుతున్న వర్గాలకు మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి యలమంచిలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావుకు సూచించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో శుక్రవారం పార్టీ అధినేతను కలిసిన ప్రగడ ఇక్కడి ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిం చారు.   అచ్యుతాపురం సెజ్‌లో బ్రాండెక్స్ అపెరల్ ఇండియా లిమిటెడ్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును  వివరించారు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో పైపులైన్ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తున్న మత్స్యకారుల ఇబ్బం దులను తెలియజేశారు.



ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పత్రికా కథనాలు, ఆందోళనల సమాచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికుల వేతనాల పెంపుదల, పీఎఫ్ చెల్లింపు, వేధింపులు తదితర సమస్యలపై ఆందోళనకు దిగిన మహిళల పట్ల అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును  తెలియజేశారు. పోలీసు బలగాల సాయంతో మహిళల పోరాటాన్ని అణచివేసేందుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కుట్రలను   ప్రతిపక్ష నేత అడిగి తెలుసుకున్నారు. మహిళలకు మద్దతు ఇస్తున్న సీపీఎం నాయకులను అరెస్ట్‌లతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రగడ తెలియజేశారు. మహిళా కార్మికులు, మత్స్యకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పెద్దఎత్తున పోరాటం చేయాలని  జగన్ సూచించారు.



ఇందుకు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే జిల్లా నాయకులతో చర్చించి బాధిత వర్గాలకు అండగా నిలిచేందుకు కార్యాచరణ రూపొందించి ఆందోళన చేపట్టాలని  దిశానిర్దేశం చేశారు. ఇక్కడి సమస్యలను విన్న తర్వాత ప్రతిపక్ష నేత అన్నింటికీ సానుకూలంగా స్పందించారని ప్రగడ   శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. కేసులకు భయపడేదిలేదని, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు, పూడిమడక మత్స్యకారులకు తమ పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలకు తెగబడుతోందని, రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో వివిధ సమస్యలు, కొన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్‌కు వినతిపత్రం అందజేసినట్టు  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top