రెచ్చిపోండి..మేం చూసుకుంటాం


సాక్షి, గుంటూరు: పదేళ్ల తర్వాత అధికారం చేతికొచ్చింది.. ఏం చేస్తారో చేసుకోండి.. అండగా మేముంటాం.. ఏం జరిగినా మేం చూసుకుంటాం.. మీ మాట వినే అధికారులను వేయిస్తాం.. అంటూ జిల్లాలోని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు కార్యకర్తలకు భరోసా ఇచ్చేస్తున్నారు. దీంతో రెచ్చిపోతున్న గ్రామ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను కబ్జా చేసేస్తున్నారు.

 

 వీటిని నిర్వహిస్తున్న ఇతర పార్టీలవారిని,  తటస్థులను అధికారుల సహకారంతో పక్కకు తప్పించేస్తున్నారు. అదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై గ్రామాల్లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు గొడవలకు దూరంగా, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సైతం ఒకరిద్దరి వల్ల తిరిగి అశాంతి రేగుతోందని, దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 పొలాలను కౌలుకు తీసుకోనివ్వటం లేదు.: ఇప్పటివరకు ప్రభుత్వ ఏజెన్సీలను కబ్జా చేయటంలో మునిగితేలిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సొంత వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నారు. వీరి పొలాలను కౌలుకు తీసుకోవద్దని రైతులను, పొలం పనులకు రావద్దని కూలీలను బెదిరిస్తున్నారు.

 

 టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుు. ప్రజలిచ్చిన అధికారాన్ని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తూ చివరకు గ్రామాల్లో దాడులు చేయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడం శోచనీయమని మండిపడుతున్నారుు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో గ్రామాల్లో మరింత అశాంతి చెలరేగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు.

 

 అధికారుల అండదండలు..

 టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలతో మంచి పోస్టింగ్‌లు పొందిన, పొందాలనుకునే అధికారులు వారు చెప్పిందే వేదంగా భావిస్తూ ఎంతటి అన్యాయమైనా సరే చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిందే తడవుగా రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలపై దాడులు నిర్వహిస్తున్నారు. చిన్న తప్పును సాకుగా చూపి వాటిని టీడీపీ కార్యకర్తలకు బదలాయిస్తున్నారు. గ్రామాల్లో దాడులు జరిగాయనే సమాచారం అందినా.. టీడీపీ నేతలు చెప్పేవరకు పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకోవటం లేదు. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలోని అనేక గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top