శ్రీశైలంపై కేసీఆర్ రాజకీయ రాద్ధాంతం

శ్రీశైలంపై కేసీఆర్ రాజకీయ రాద్ధాంతం - Sakshi


ప్రొద్దుటూరు టౌన్:

 శ్రీశైలం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) రాజకీయం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ విషయంలో విజయం సాధించారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంలో మైనస్‌లో ఉన్నారన్నారు.



రాజకీయం కోసం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా తాను, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో ఈ విషయంపై మాట్లాడామన్నారు. శ్రీశైలం నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడం తెలంగాణ ఆపేస్తే ఎంత లాస్ అవుతుందో అంత విద్యుత్‌ను తాము ఇస్తామని చెప్పామన్నారు. శ్రీశైలంలోని నీరు రాయలసీమ జిల్లాలకు ఎంతో అవసరమని కూడా చెప్పామన్నారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని రాయలసీమ నాయకుల అభ్యర్థన మేరకు చంద్రబాబు ముందే నిలిపివేసిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.



రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహన లోపం వలనే ఈ వివాదం తలెత్తిందన్న విమర్శలపై మంత్రి మాట్లాడుతూ తాము ఇప్పటికే కేసీఆర్‌ను చర్చలకు ఆహ్వానించామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. తుపాన్‌తో విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి పునరుద్దరించామన్నారు.



కేంద్రం ప్రకటించిన రూ.1000 కోట్లు సరిపోదని, మరో రూ.1000 కోట్లు ఇవ్వాలని కోరామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయంపై ఇంత వరకు ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించగా త్వరలో వెల్లడిస్తారని దాటవేసే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు.ఎర్రచందనం అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై కఠినంగా వ్యవహరించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు.



పోలీసుల సంక్షేమానికి రూ.10కోట్లు విడుదల చేశామని తెలిపారు. పోలీసు సంక్షేమానికి రూ.3,600 కోట్లు కావాలని కోరామన్నారు. కొత్త ప్లాన్లతో వీటన్నింటిని ఆధునీకరిస్తామని మంత్రి చెప్పారు. విలేకరులకు త్వరలో హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top