తెలంగాణలో విధ్వంసం నిరూపిస్తా

తెలంగాణలో విధ్వంసం నిరూపిస్తా - Sakshi

 బహిరంగ చర్చకు సిద్ధమా.. పొన్నాల? నిజామాబాద్ నగారాలో కేసీఆర్ సవాల్

  •   హిరోషిమా, నాగసాకిలను మించిన నష్టం జరిగింది

  •   ఏ జిల్లాను ఎంచుకున్నా సరే చూపిస్తా

  •   ఆంధ్రకు అక్రమ ప్రాజెక్టులు కట్టి హారతులిచ్చారు

  •   ఆంధ్రా వాళ్లను పల్లకీలో మోస్తారు.. 

  •   ఎప్పుడూ నంబర్-2గానే ఉంటారు

  •   సెటిలర్స్ ఓట్ల కోసమే ఉద్యోగులకు

  •   ఆప్షన్లు ఉండాలంటున్నారు

  •   టీ-కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ చీఫ్ ధ్వజం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో జరిగిన విధ్వంసంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. పొన్నాల అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొన్నేళ్లుగా తెలంగాణలో విధ్వంసం జరిగిందా లేదా తెలుసుకోవడానికి తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అవసరమా? అంటున్న పొన్నాల అజ్ఞానంపై ఏమనాలో అర్థం కావడం లేదని   వ్యాఖ్యానించారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తానని, వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు జూన్ రెండు నుంచి పన్నులుండకుండా చట్టం తీసుకువస్తామన్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహిం చిన ‘నిజామాబాద్ నగారా’ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘తెలంగాణకు అన్యాయం జరిగింది. హిరోషిమా, నాగసాకిని మించిన విధ్వంసం జరిగిందంటే పొన్నాల లక్ష్మయ్య అవాకులు చెవాకులు మాట్లాడుతడా. నిజంగానే దమ్ము ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే.. పొన్నాల లక్ష్మయ్య ఏ జిల్లాను ఎంచుకున్నా అక్కడ జరిగిన విధ్వసం నిరూపిస్తా’ అని సవాల్ విసిరారు. 

 

60ఏళ్లుగా తెలంగాణలో ఎంతో విధ్వంసం జరిగినా.. పొన్నాల జరగలేదనడం సిగ్గుచేటన్నారు. ‘ఆంధ్రకు అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలిస్తే మంత్రి డీకే ఆరుణ మంగళహారతిస్తది. పొన్నాల లస్మయ్య జెండా ఊపుతడు. వీళ్లా తెలంగాణను బాగు పరిచేది. వాళ్ల అజ్ఞానానికి చింతిస్తున్నాను’ అంటూ టీఆర్‌ఎస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రాజెక్టులను అడ్డుకున్న ఘనత తమదేనన్నారు. అనంతపురం జిల్లాలో గాలేరు అక్రమ ప్రాజెక్టును మంత్రి రఘువీరారెడ్డి నిర్మించి.. తెలంగాణ నీటిని అక్రమంగా తీసుకెళ్లితే పోరాడామన్నారు. సెటిలర్స్ ఓట్ల కోసమే ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారని, సెటిలర్స్ ఓట్లకు ఆశపడుతున్న నేతలు తెలంగాణ ప్రజలను ఓట్లడగడానికి సిగ్గుండాలన్నారు. ‘వారు విమర్శించడానికి నేనే దొరికానా! బక్కపలుచటోన్ని నన్ను విమర్శించి ఏం చేస్తారు? ఆంధ్రా వాళ్లను పల్లకీలో మోస్తారే తప్ప.. వీళ్లు పల్లకీలో కుర్చుండరు. ఎప్పుడూ నెంబర్-2 స్థానంలోనే ఉంటారు’ అని టీ-కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ దుయ్యబట్టారు.

 

 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా..

బోధన్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొస్తామని, నిజాం సాగర్ ప్రాజెక్టును ఆధునీకరించి అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీని ఆగంచేస్తే చెరుకు మాయమైందన్నారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన వంగడాలు, మద్దతు ధర కల్పిస్తామన్నారు.  జిల్లాలోని వ్యవసాయ రంగ అభివద్ధికి కృషి చేస్తానని, సింగూరు జలాలను 90 శాతం జిల్లాకు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకొని పనిచేయిస్తానని, బీసీలుగా ఉన్న కాగిత లంబాడీలను ఎస్టీలో చేర్చుతానన్నారు. మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

 

తెలంగాణ యూనివర్సిటీ నామమాత్రంగానే ఉందని, దాన్ని పూర్తి స్థాయి వర్సిటీగా తీర్చిదిదుతానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు మూడేళ్ల పాటు అధికార బదిలీలు ఉండవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు పూర్తి అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. వారికి స్పెషల్ ఇంక్రిమెంట్లు, కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఎవరికో ఓటేసి పని చేయమంటే  చేయరు. గాడిదకు గడ్డేసి గేదెను పాలివ్వమన్నట్లు, ముళ్ల చెట్లకు నీళ్లు పోసి పండ్లు ఇమ్మన్నట్లు ఉంటుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఎవరు పనిచేస్తారో ఆలోచించి ఓటేయాలి’ అని ప్రజలకు కేసీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్ నూటికి నూరుపాళ్లు లౌకిక పార్టీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ శక్తులతో చేతులు కలపబోమని పునరుద్ఘాటించారు. ఢిల్లీ పీఠంపై ‘మూడో’ ప్రత్యామ్నాయమే ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.

 

కాంగ్రెస్‌కే దిక్కులేదు.. డీఎస్ సీఎం అవుతారా!

కేసీఆర్ సభలో మాట్లాడుతున్నప్పుడు నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ ఆయనకో చీటి రాసిచ్చారు. నిజామాబాద్ రూరల్‌లో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తన ప్రచారంలో భాగంగా తనను గెలిపిస్తే సీఎం అవుతానని చెప్పుకుంటున్నట్లు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదంటే ఇంక డి.శ్రీనివాస్ గెలుస్తడు.. సీఎం అవుతాడంటే ఎవలు నమ్మాలే!’ అంటూ చలోక్తులు విసిరారు. ఈ సమావేశంలో నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థులు బిగాల గణేష్‌గుప్తా, అశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హన్మంత్‌షిండే, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top