‘కాన్వకేషన్' కష్టాలు

‘కాన్వకేషన్' కష్టాలు - Sakshi


సాక్షి, కర్నూలు:  రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల ఎంబీఏ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థినికి సౌత్ ఆఫ్రికాలోని ఓ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూలో ఆ సంస్థ యూనివర్సిటీ కాన్వకేషన్ సర్టిఫికెట్ కోరింది. లేకపోతే ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేసింది..ఇక్కడే ఎంసీఏ పూర్తి చేసిన ఓ విద్యార్థిని బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధికారులు ఇంటర్వ్యూకు ఆహ్వానం పంపారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో యూనివర్సిటీ ‘కాన్వకేషన్’ను కోరారు.



యూనివర్సిటీలో ఇవ్వలేదని బదులిచ్చారు. తప్పనిసరి ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పడంతో నిరాశతో వెనుదిరుగారు.. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రెండేళ్లుగా కొన్ని వందల మంది విద్యార్థులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించండంటూ ఎందరో విద్యార్థులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారు.



అధికారుల ఉదాసీనత.. ముందుచూపు లేమి.. సిబ్బంది సమస్య.. వెరసి

 దాదాపు 50 వేల విద్యార్థులకు ‘కాన్వకేషన్’ కష్టాలు.. జిల్లాలో ఎస్వీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ సెంటర్‌ను 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ యూనివర్సిటీగా మర్చారు. అదే ఏడాది జూన్‌లో ఆయన ప్రారంభించారు. దీని పరిధిలో 129 అనుబంధ కళాశాలలున్నాయి.



89 అండర్ గ్రాడ్యూయేట్.. 37 బీఈడీ, 4 ఎంఈడీ, న్యాయశాఖ, 19 పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వర్సటీ ఏర్పాటైన తరువాత దాని అనుబంధన కళాశాలల నుంచి 20 వేల మందికిపైగా  డిగ్రీ పూర్తి చేసుకున్నారు. 5 వేల మంది పీజీ పూర్తి చేశారు. ప్రైవేటు కళాశాల్లో పీజీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడీ, బీఈడీ తదితర కోర్సులను మరో 20 వేల మంది పూర్తి చేశారు. వీరంతా ‘పట్టా’కు నోచుకోలేకపోయారు.



 అధికారుల అలసత్వం.. : మన జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీతోపాటు కృష్టా జిల్లాలోని మచిలిపట్నంలో కృష్ణా యూనివర్సిటీని ఒకేసారి ప్రారంభించారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల మధ్య అంతర్గత గొడవలు కారణంగా పరిపాలన విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవ ప్రతిపాదనలు రూపొందించడంలో తీవ్ర జాప్యం జరిగింది.



దీంతో వేలా మంది విద్యార్థులు కాన్వగేషన్ సర్టిఫికెట్‌కు దూరమయ్యారు. ఎవరైనా ససేమిరా అంటే మాత్రం ‘పాస్ ఔట్’ సర్టిఫికెట్‌ను అందజేస్తుండడం విశేషం. ఇదే సమయంలో కృష్ణా విశ్వవిద్యాలయం మాత్రం ఇప్పటికే రెండు సార్లు స్నాతకోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం.

 

 స్నాతకోత్సవం జరిగేదెన్నడు?


 ఏటా విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవాలు జరుగుతుంటాయి. కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాల్లో  మొదటిసారి స్నాతకోత్సవం జరగాలంటే విశ్వవిద్యాలయానికి  చాన్సలర్  కొనసాగుతున్నగవర్నర్ ఆమోదం ఉండాలి. ఆయన ఆధ్వర్యంలోనే మొదటి స్నాతకోత్సవం జరుతుంది. దీనికి ముందుగా యూనివర్సిటీ అధికారులు ఓ పానల్‌ను రూపొందించి మానటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ(ఎంఅండ్‌డీసీ)కి పంపి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పాటైన తర్వాత మొట్ట మొదటి వైస్ చాన్సలర్‌గా ప్రభాకర్‌రావు పనిచేశారు.



ఈయన పదవి కాలం 2011లో ముగిసింది. అనంతరం కృష్ణానాయక్ వీసీగా కొనసాగుతున్నారు. వచ్చే నెల 9తో ఆయన పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఇప్పటి వరకూ రెండు బ్యాచ్‌ల దాదాపు 50 వేల మందికిపైగా విద్యార్థులు తమ డిగ్రీలు పూర్తి చేసుకున్నారు. కాన్వకేషన సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇద్దరు వీసీలు.. నలుగురుకుపైగా రిజిస్ట్రార్లు ఇక్కడ విధులు నిర్వహించినా ఏనాడు స్నాతకోత్సవ నిర్వహణపై దృష్టిసారించకపోవడం గమనార్హం.



అయితే గత నెలలో ప్రస్తుతం వీసీ స్నాతకోత్సవ ఆమోదానికి ఓ ప్యానల్ రూపొందించి ఎంఅండ్‌డీసీ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది. కాగా, స్నాతకోత్సవం జరుపుకోవాలంటే 45 రోజుల ముందు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ఇద్దరికి గౌరవ డాక్టరేట్లను ఇవ్వాలి. వీరిని విశ్వవిద్యాలయం అధికారులే ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత వీసీ పదవీ కాలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ ‘పట్టాభిషేక మహోత్సవం’ జరిగే అవకాశం లేకుండా పోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top