కనుమూరి కల చెదిరింది

కనుమూరి కల చెదిరింది - Sakshi


టీటీడీతోపాటు అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దుచేసిన మంత్రివర్గం

 

తిరుపతి: పదవీకాలం పూర్తయ్యేదాకా టీటీడీ  చైర్మన్‌గా కొనసాగాలన్న బాపిరాజు కలలు కల్లలయ్యాయి. టీటీడీ సహా అన్ని ఆలయాల పాలక మండళ్లను రద్దుచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో బాపిరాజు డీలాపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 25, 2012న అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజుకు అనుహ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


 


ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని.. లేదంటే బలవంతంగా తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. తన పదవీకాలం ఆగస్టు 24తో పూర్తవుతుందని.. అప్పటిదాకా పదవిలో కొనసాగించాలని చంద్రబాబును కనుమూరి కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా బాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వెంకయ్య దన్నుతో పదవీకాలం పూర్తయ్యేవరకూ టీటీడీ చైర్మన్‌గా తానే కొనసాగుతానని కనుమూరి అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేశారు. కానీ.. ఆయన అంచనాలు తలకిందులయ్యా యి.



టీటీడీ సహా అన్ని ఆలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కనుమూరి  2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు.. 2012, ఆగస్టు 25 నుంచి 23 నెలలపాటు  టీటీడీ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. అయితే అటు ఆలయాభివృద్ధికిగానీ, ఇటు భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చడంలోగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.


 


కేవలం పారిశ్రామికవేత్తలకూ, సినీనటులకూ, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తోన్న నేతలకు శ్రీవారి దర్శనాలు చేయించి, వారి మెప్పు పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ప్రొటోకాల్ విషయంలో అప్ప టి ఈవో ఎల్వీ సుబ్రమణ్యంతో విభేదించారు. చివరకు టీటీడీ ఈవోగా ఎల్వీని తప్పించి ఎంజీ గోపాల్‌ను నియమించారు. ఎంజీ గోపాల్‌తోనూ కనుమూరి విభేదించడం గమనార్హం.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top