కళింగ వైశ్యుల కల సాకారం


సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ఆర్థికంగా వెనుకబడిన కళింగ వైశ్య సామాజికవర్గానికి బీసీ హోదా దక్కింది. దివంగత వైఎస్ హయాంలో వేసిన ప్రతిపాదనల విత్తు.. ఇప్పటికి మొగ్గ తొడిగి ఆర్థిక, సామాజిక ఫలాలు అందించేందుకు సిద్ధమైంది. లక్షల్లో ఉన్న ఈ సామాజిక వర్గీయుల ఆశలకు ప్రతిరూపమైన ఈ ఫైలుకు మోక్షం లభించడంతో జిల్లాలోని ఆ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో తమ పిల్లల ఎదుగుదలకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అంటున్నారు.

 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చే ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సంతకం చేశారన్న వార్త ఆ వర్గంలో సంతోషాల్ని నింపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న ఈ సామాజిక వర్గీయులు రాప్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. పేరుకు అగ్రవర్ణమే అయినా చిరు వ్యాపారాలే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కళింగ వైశ్యులకు ఎట్టకేలకు బీసీ హోదా దక్కడంపై ఆ వర్గీయులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సామాజికవర్గంలో కొన్ని కుటుంబాలు ధనికవర్గానికే చెందినప్పటికీ దాదాపు  90 శాతం మంది పేదలేనని పలు కమిషన్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించినా బీసీ జాబితాలో చేర్చడంలో చాలా జాప్యం జరిగింది.

 

వైఎస్ హయాంలో అంకురార్పణ

కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను తొలిసారి సీరియస్‌గా పట్టించుకున్న నేత దివంగత వైఎస్సే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు వచ్చిన పలు సందర్భాల్లో కళింగ కోమటి సంఘం నాయకులు ఆయనకు తమ కష్టాలను విన్నవించుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీ జాబి తాలో చేర్చాలని కోరుతున్న విషయాన్ని తెలి యజేయారు. వారి వినతులకు సానుకూలం గా స్పందించిన ఆయన దీనిపై సమగ్ర పరిశీలనకు కమిషన్‌ను నియమించారని కళింగ కోమటి సంఘ నాయకులు చెబుతున్నారు.

 

వై.ఎస్.తోపాటు ఆయన హయాంలో అర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య చొరవతో బీసీ కమిషన్ ఏర్పాటైంది. దళవాయి రమేష్, పుట్టుస్వామి కమిషన్, సుబ్రమణియన్ కమిటీలు జిల్లాలో పర్యటించి కళింగ కోమట్లను బీసీల్లో చేర్చవచ్చని సూచిస్తూ నివేదికలు ఇచ్చాయి. ఆ మేరకు ఫైలు సిద్ధమైనా గత ప్రభుత్వాలు ఎందువల్లనో కాలయాపన చేశాయి. చివరికి సార్వత్రిక ఎన్నికల ముందు కిల్లి కృపారాణి చొరవతో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ ఫైలుపై సంతకం చేశారన్న ఉత్తుత్తి ప్రచారంతో హడావుడి చేశారు. చివరికి అదంతా తప్పని తేలింది. ఎట్టకేలకు ప్రస్తుత సీఎం కళింగ కోమట్లను బీసీలో చేరుస్తూ ఫైలుపై సంతకం చేశారని సంఘం నాయకులు కూడా చెబుతున్నారు.

 

1982 నుంచి పోరాటాలు చేస్తున్న తమకు ఇన్నాళ్లకు విముక్తి కలిగిందంటున్నారు. తమ పిల్లల చదువులకు రాయితీలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాల్లో లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే బీసీలో ఏ గ్రూపులో చేర్చుతారన్నది తేలాల్సి ఉందని.. బహుశా బీసీ-డీలో చేర్చే అవకాశం ఉందని, అధికారిక ఉత్తర్వులు ఇంకా అందాల్సి ఉందని చెబుతున్నారు. సీఎం సంతకం చేసినందున నిబంధనలతో కూడిన ప్రకటన విడుదల కావడమే ఆలస్యమని, అప్పుడే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని కళింగ కోమటి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ హరగోపాల్ తెలిపారు.

 

జిల్లాలో ఇదీ పరిస్థితి

రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కళింగ వైశ్యులు ఉన్నప్పటికీ.. అధికశాతం శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారిలో అధికశాతం వీరే. శ్రీకాకుళం జిల్లాలో ఈ సామాజిక వర్గానికి చెందిన సుమారు 2.50 లక్షల కుటుంబాలున్నాయి.

 

వీరిలో సుమారు 1.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఒక్క శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే సుమారు 92,800 మంది ఓటర్లున్నారు. పోరాటాల ఫలితంగా ఇన్నాళ్లకు తమకు ఓ గుర్తింపు లభించిందని చెబుతున్నారు. కళింగ కోమట్లను బీసీలో చేరుస్తూ ముఖ్యమంత్రి సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, దీని వెనుక జిల్లా మంత్రి అచ్చన్నాయుడుతోపాటు ఎమ్మెల్యేల చొరవ కూడా ఉందని చెబుతున్నారు. 1982 నుంచి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లో ఉన్న కళింగ కోమట్లకు న్యాయం జరిగినట్లయిందని ఆ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు వరహా నరసింహం (వరం) ‘సాక్షి’తో అన్నారు. వైఎస్ హయాంలో మొదలైన ప్రక్రియ ఇప్పటికి పూర్తి అయిందని అంటూ ఇందుకు సహకరించిన, కృషి చేసిన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top