ఉద్యోగం కోసం..

ఉద్యోగం కోసం.. - Sakshi


ఒంగోలు టౌన్: పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మేకల కాపరి అన్యాయంగా మృతి చెందాడు. తమ కుటుంబానికి  న్యాయం చేయాలంటూ మృతుని భార్య పోరు బాట పట్టింది. ఈ విషయం అప్పటి కలెక్టర్ దేవానంద్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఆమెకు అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారు. విధుల్లో చేరిన కొన్నేళ్ల త ర్వాత ఆమెను అకారణంగా తొలగించేశారు. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ గురువారం కలెక్టరేట్ వద్ద ‘ఉద్యోగ’ పోరాటానికి దిగింది. కలెక్టరేట్ ముందు బైఠాయించి తనకు జరిగిన అన్యాయంపై విలేకరుల వద్ద భోరున విలపించింది.  



ఇదీ.. జరిగింది

1992లో కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీలోని రామాంజనేయకాలనీ సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అక్కడే మేకలు కాసుకుంటున్న నాగార్జున అనే వ్యక్తికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య కళావతి, కుమారుడు ఉన్నాడు. కట్టుకున్న భర్త అకారణంగా మరణించడం, పసి బిడ్డను ఎలా సాకాలో తెలియక కళావతి ఆందోళన చెందింది. తనకు న్యాయం చేయాలని అప్పటి నుంచి అధికారులను వేడుకుంటూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో 2009లో అప్పటి కలెక్టర్ దేవానంద్ ఆమెను అంగన్‌వాడీ కార్యకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



అంగన్‌వాడీ కార్తకర్తగా కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెకు ఆ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌గా విద్యావతి ఉన్న సమయంలో కళావతిని గతేడాది అకారణంగా తొలగించారు. ప్రస్తుత కలెక్టర్ విజయకుమార్ మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో భాగంగా తర్లుపాడు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ సమయంలో కళావతి తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన వద్ద ఏకరువు పెట్టింది.



తన పోస్టుకు మరొకరు 50 వేల రూపాయలు ఇస్తానని ఆశ చూపడంతో తనను విధుల నుంచి తొలగించారని కళావతి వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకొంది. కురిచేడు నుంచి ఒంగోలు వచ్చినా ఇక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు ఆమె ఉండి ఉసూరుమంటూ వెనుదిరిగింది. ఆమెకు అధికారులు ఏం న్యాయం చే స్తారో చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top