వర్మా.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్

వర్మా.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్ - Sakshi


 పిఠాపురం :వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్ర ప్రమాద బాధితులకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఏమీ చేయలేదని విమర్శలు చేస్తున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే  జ్యోతుల నెహ్రూ విమర్శించారు. శనివారం ఆయన ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వర్మతీరుపై మండిపడ్డారు. పదవి రాక ముందు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బాధితులకు వేలాది రూపాయలు పంపిణీ చేసి, పదవి రాగానే బాధితులకు పైసా విదల్చకపోవడంలో మర్మ మేమిటో వర్మకే తెలియాలని ఆయన దుయ్యబట్టారు.

 

 పదవి కోసం ప్రజలను ఆకట్టుకునేందుకు బాధితులను ఓదార్చినట్టు నటించిన సంగతి తేటతెల్లమైందన్నారు. ప్రతిపక్షనేత ఎందుకు వస్తారో, ఏం చేస్తారో తెలియని అమాయక స్థితిలో ఉండి వర్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు చూస్తు ఊరుకోరన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాగానే బాధితులు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎక్కడ బయటపెడతారోనన్న భయంతో వారిని లోపలపెట్టి గేట్లు వేయించిన నీచ రాజకీయ నేతగా వర్మ చరిత్రలో నిలిచి పోతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పలు ప్రమాదాల్లో బాధితులకు రూ.5 లక్షలు పరిహారం ఇచ్చారని, ఇక్కడ మాత్రం కేవలం రూ.2 లక్షలకే ప్రకటించడం తగదన్నారు. ప్రజాగ్రహంతో దిగివచ్చి మళ్లీ దానిని రూ.3 లక్షలకు పెంచడం పాలకుల చేతగానితనానికి నిదర్శనంగా నెహ్రూ అభివర్ణించారు.

 

 సొంతంగా ఒక్క రూపాయి కూడా విదల్చని వర్మ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేందుకు సాహసించడం విడ్డూరంగా ఉందన్నారు. దహన సంస్కారాలకు ఇచ్చిన రూ.5 వేలు కూడా తమ సొంత సొమ్ము ఇచ్చినట్టు వర్మ చెప్పుకోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు మాట్లాడుతూ జరిగిన సంఘటనకు చలించిన జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించి, అన్ని ప్రాంతాలు పూర్తిగా పరిశీలించి వారికి ఆసరాగా నిలబడతానని మాట ఇచ్చారన్నారు. దానిని నిలబెట్టుకునేందుకు బాధితులకు ఒక్కొక్కరికి రూ.50వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వాటిని పంపిణీ కూడా చేశామని తెలిపారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top