సుప్రీం కోర్టులో న్యాయం జరగొచ్చు

సుప్రీం కోర్టులో న్యాయం జరగొచ్చు


వాకపల్లి సంఘటనపై మేధావుల ఆశాభావం

గిరిజన మహిళల పోరాటానికి పదేళ్లు

మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు




బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): వాకపల్లి బాధిత గిరిజన మహిళలకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని మేధావులు వ్యక్తంచేశారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వాకపల్లిలో 2007 ఆగస్టు 20న  గ్రేహౌండ్స్‌ దళాలు 11 మంది కోందు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చోటుచేసుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలోని ఒక హోటల్లో ఆదివారం మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.



ఈ సందర్భంగా న్యాయవాది వసుధ నాగరాజ్‌ మాట్లాడుతూ, అప్పట్లో కొండకోనల్లో  15 కిలోమీటర్లు నడుచుకుంటూ పాడేరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారంటే గ్రేహౌండ్స్‌ పోలీసులు ఎన్ని చిత్ర హింసలకు గురిచేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సంఘటనపై నిందితులైన 21 మంది పోలీసులపై కేసు నమోదు చేసి  విచారించాలని 2008 ఆగస్టులో  పాడేరు మేజిస్రేట్‌ కోర్టు  తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. అయితే నిందితులు హైకోర్టుకు వెళ్లడంతో విచారణపై స్టే ఇచ్చారన్నారు.



ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించగా వారు పోలీసులు అత్యాచారానికి పాల్పడలేదని నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. అప్పట్లో   ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను కూడా ప్రభావితం చేశారని ఆరోపించారు. న్యాయం కోసం గిరిజన మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఒక వేళ అక్కడా కొట్టివేస్తే అది కోర్టు ఓటమి అవుతుంది తప్ప ఆదివాసీ మహిళల ఓటమి కాదని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ రచయితల సంఘం రామారావు దొర మాట్లాడుతూ కోందు జాతి ప్రజలను పోలీసులు మావోయిస్టుల్లా  చూస్తున్నారని, వారిని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.



దీంతో గత పదేళ్లుగా వాకపల్లి గ్రామస్తులు బయటకు రావటం మానేశారన్నారు. మానవ హక్కుల వేదిక ప్రతినిధి ప్రొఫెసర్‌ జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ గిరిజనులు మావోయిస్టులకు సహాయం చేస్తున్నారనే నేపంతో పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేసి చిత్ర హింసలకు గురుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాకపల్లి మహిళలు అన్నిరకాల ఒత్తిళ్లనూ తట్టుకుని ధైర్యంగా నిలబడటం గొప్పవిషయమన్నారు. ఈ పదేళ్ల కాలంలో ఇద్దరు బాధిత మహిళు మరణించారని తెలిపారు.మహిళా చేతన నాయకురాలు కె.పద్మ మాట్లాడుతూ, మావోయిస్టులపై ప్రతీకారం కోసమే గ్రేహౌండ్స్‌ దళాలు వాకపల్లి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా వాటిని బయటకు రానీయకుండా ఉన్నాతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top