మన వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

మన వైభవాన్ని ప్రపంచానికి చాటాలి - Sakshi

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ పిలుపు

  • భాష సమాజానికి వారధి: జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

  • గోరటి వెంకన్నకు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం ప్రదానం

  • సాక్షి, విశాఖపట్నం: ‘‘పలు రాజకీయ కారణాలతో కొత్త రాష్ట్రంలోకి వచ్చాం. మళ్లీ మన (తెలుగు వారి) వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కళాకారులు, సాహితీ వేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ అసెంబ్లీ హాల్‌లో శనివారం రాత్రి లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డును సాహితీ వేత్త గోరటి వెంకన్నకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడారు. మారుతున్న తరానికి అనుగుణంగా గోరటి వెంకన్న చక్కటి రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. సాహితీవేత్తలతో పాటు ఇతర రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు సైతం లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశంలోనే మంచి గుర్తింపు లభించే స్థాయికి ఈ పురస్కారాన్ని తీసుకెళ్లాలన్నారు. కాలంతో పాటు కళారూపాల్లో, కళలు సాధన చేసిన వారి తరగతుల్లోనూ మార్పు వచ్చిందని చెప్పారు. కళలను ఆస్వాదించడం మానవ లక్షణమని, దానికి పెద్దగా చదువు అక్కర్లేదని, మనిషైతే చాలని వెల్లడించారు.



    భాష సమాజానికి వారధి లాంటిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. గోరటి వెంకన్న పాటల్లో సందేశం ఉంటుందన్నారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ... 13 ఏళ్లుగా సాహితీరంగంలో విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందజేస్తున్నామన్నారు.



    రెండు రాష్ట్రాల ఆత్మ ఒకటే

    తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈ రెండింటి ఆత్మ ఒకటేనని అవార్డు గ్రహీత గోరటి వెంకన్న తెలిపారు. ఉత్తరాంధ్రలో రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) తనకు ప్రేరణ అని, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి తనకు గురువులని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్‌ పంచెకట్టులో ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పంచెకట్టులో జస్టిస్‌ చలమేశ్వర్‌ను చూస్తుంటే దివంగత నేతలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు గుర్తుకొస్తున్నారని చెప్పారు.



    గోరటికి అవార్డు ప్రదానం

    తొలుత గోరటి వెంకన్నకు లోక్‌నాయక్‌ ఫౌండే షన్‌ అవార్డును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ లావు నాగే శ్వరరావు, జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జి.రఘురాం, మంత్రి గంటా శ్రీనివాస రావు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ల సమక్షంలో ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1.50 లక్షలు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top