జూరాల క్రస్టుగేట్ల ఎత్తివేత

జూరాల క్రస్టుగేట్ల ఎత్తివేత - Sakshi


గద్వాల/శ్రీశైలం/సాక్షి, బళ్లారి: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి జూరాలకు చేరిన కృష్ణమ్మ పరవళ్లు గురువారం శ్రీశైలం రిజర్వాయర్ వైపునకు సాగాయి. ఎగువ నుంచి 87,855 క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వస్తుండగా గురువారం ప్రాజెక్టుకు చెందిన 13 క్రస్టుగేట్లు ఎత్తి శ్రీైశె లం రిజర్వాయర్‌కు 85,420 క్యూసెక్కుల నీటిని  విడుదల చేశారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది.

 

మరోవైపు ఆల్మట్టికి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 87,079 క్యూసెక్కులు వస్తుండడంతో.. ప్రాజెక్టుకు చెందిన 20 క్రస్టుగేట్లను ఎత్తి లక్షా 32 వేల 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అదే సమయంలో నారాయణపూర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 89,119 క్యూసెక్కులుగా ఉండగా.. ప్రాజెక్టుకు చెందిన 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువ నదిలోకి లక్షా 44 వేల 250 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో కృష్ణా జలాలు జూరాలకు.. అక్కడినుంచి శ్రీశైలానికి ఉరకలు పెడుతున్నాయి.

 

నేడు తుంగభద్ర గేట్ల ఎత్తివేత..: భారీ వర్షాల వల్ల తుంగభద్ర ఆనకట్ట నిండుకుండలా తొణికిసలాడుతోంది. దీంతో ఆనకట్టకున్న 35 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని దిగువకు వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి డ్యాంలో నీరు 96 టీఎంసీల(గరిష్టం 103 టీఎంసీలు)కు చేరుకునే అవకాశం ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదలాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం డ్యాంలోకి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

 

స్థిరంగా అల్పపీడనం: బంగాళాఖాతంలో నిన్నటివరకు ఉన్న అల్పపీడనం గురువారానికి ఒడిశా పైకి చేరుకుంది. ప్రస్తుతం ఇది తీరం వెంబడి ఉన్నప్పటికీ శుక్రవారానికి పూర్తిగా నేలపైకి చేరే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో అక్కడక్కడ కాస్త వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పూర్తిగా బలహీనమయ్యాకగానీ తర్వాతి పరిస్థితులు తెలియవన్నారు.

 

వర్షపాతం వివరాలు: గురువారం సోంపేటలో గరిష్టంగా 6 సెం.మీ., పాతపట్నం 5, టెక్కలి, విజయవాడల్లో 4, పాలకొండ, కళింగపట్నం, మందస, పలాసలో 3 సెం.మీ., తెలంగాణలోని మెట్‌పల్లి, జగిత్యాలల్లో 5 సెం.మీ., ఇబ్రహీంపట్నం, నిర్మల్‌లో 4, ధర్మపురి, జగిత్యాల, లక్సెట్టిపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top