జూనియర్ డాక్టర్ల సమ్మె బాట

జూనియర్ డాక్టర్ల సమ్మె బాట - Sakshi


తిరుపతి కార్పొరేషన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు.  ముందుగా ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు రుయా ఆస్పత్రి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. రుయా ఆస్పత్రితో పాటు మెటర్నటీ హాస్పిటల్, ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పీజీ,యూజీ, హౌస్ సర్జన్లు  క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీ, ఆర్‌ఐసీయూ విభాగాల్లో మినహా మిగిలిన వైద్య సేవలను బహిష్కరించారు. రుయా ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున జూడాలు గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



ప్రభుత్వానిది బ్లాక్‌మెయిలింగ్

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్ చేస్తోందన్నారు. పీజీలో ఏడాదిపాటు విధిగా గ్రామీణప్రాంతంలో పనిచేయాలనే నిబంధన పెడుతున్నారన్నారు. లేకుంటే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల జామీనుతో కూడిన రూ.20 లక్షలు బాండ్ తీసుకుంటున్నారని ఆరోపించారు.  నిరుపేదలు, గ్రామీణ ప్రాంతం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన తాము రూ.20 లక్షలు ఏ విధంగా బాండ్ ఇస్తారని నిలదీశారు. పోనీ గ్రామీణ ప్రాంతంలో వైద్యసేవలు చేయిస్తారా అంటే అదీ లేదన్నారు. కేవలం ఎంసీఐ వారికి కళాశాలలో సీట్ల సంఖ్యను చూపించుకునేందుకు తమను ఎరగా వాడుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.



పీహెచ్‌సీల్లో పోస్టులు భర్తీ చేయండి

గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్‌సీలో పర్మినెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయకుండా, ఆ పోస్టుల్లో పేరుకు జూనియర్ డాక్టర్లను హౌస్‌సర్జన్లుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.  పర్మినెంట్ పోస్టులు కల్పిస్తే పల్లెకు పోవడానికి మామే సిద్ధం. మమ్మల్ని శాశ్వత ఉద్యోగానికి పంపడానికి మీకు దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏడాది పాటు వైద్య సేవలు చేయమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు.



పైగా ఆ హాస్పిటల్స్‌లో ఖాళీలను భర్తీచేస్తే వేతనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్వార్థం కోసం జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే అత్యవసర సేవలను కూడా స్తంభింప జేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జూడా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఇజాజ్, ఉపాధ్యక్షుడు నిఖిల్‌ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి నాగరాజు రాయల్, రామ్‌భూపాల్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top