జూడాల సమ్మె ఉధృతం


కడప అర్బన్ : జూనియర్ డాక్టర్‌ల (జూడాలు) సమ్మె ఉధృతమవుతోంది. మంగళవారం రిమ్స్‌లో జూడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. 107 జీఓ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిన్నర కాలంపాటు పనిచేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని, అలా పనిచేసే దమ్ము మాకుంది...అయితే తమకు శాశ్విత ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అంటూ నినదించారు. మొదట ఓపీ విభాగం ఎదుట నినాదాలు చేసిన అనంతరం ర్యాలీగా ఐపీ, దంత వైద్య కళాశాల వరకు వెళ్లారు.



అక్కడ డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఓపీ విభాగం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల పాలిట శాపంగా 107 జీఓను అమలు చేయాలని చూస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాము వైద్య సేవలు అందిస్తేనే పట్టభద్రులను చేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు.



అలాగే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని నిబంధన తీసుకొచ్చారేగానీ గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య శాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య శాలల్లో పనిచేస్తూ వారికి వైద్య సేవలు అందించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అలా పనిచేయాలంటే తమకు శాశ్విత ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.



 ఇబ్బందుల్లో రోగులు

 అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలను జూడాలు బహిష్కరించారు. ఓపీ విభాగంలో రోగులు వందలాది మంది వచ్చి ఎదురు చూస్తున్నా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రతి విభాగంలో ఉన్న ఒక్కో డాక్టరు క్యాజువాలిటీ డ్యూటీకి, ఐపీ విభాగం డ్యూటీలకు హాజరవుతూ కొన్ని ఓపీ విభాగాలలో తక్కువ సమయం కేటాయించారు. దీంతో రోగులు చాలా సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.



అలాగే ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన వికలాంగులు సడేరాం కార్యక్రమానికి వచ్చి వారు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఈ విషయమై రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను మీడియా బృందం వివరణ కోరగా, రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె కొనసాగుతోందని, తాము ఉన్న వైద్యులతోనే వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top