మృత్యు ప్రయాణం

మృత్యు ప్రయాణం - Sakshi


ఆళ్లగడ్డ రూరల్:

 18వ జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మోహన్ గౌడు(10), డీసీఎం డ్రైవర్ చంద్రశేఖర్(30), గొల్లనాగన్న(50) మృతి చెందారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కొత్తకోట, సత్యహల్లి, కొత్తకొట్టాల, వడ్డెవాడు గ్రామాలకు చెందిన 40 మంది వలస కూలీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో మైక్రోపవర్ ప్లాంట్‌లో పనులు చేసేందుకు గురువారం అర్ధరాత్రి డీసీఎం(ఏపీ 22 వై 7899)లో బయలు దేరారు. తెల్లవారు జామున జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించ బోయి ముందు వెళ్తున్న లారీ(ఏపీ 21టీ డబ్ల్యూ 9999)ను ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ప్రయాణిస్తున్న కూలీలు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈడిగ మోహన్ గౌడు అనే బాలుడు క్యాబీన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో 30 మంది కూలీలు తీవ్రంగా గాయపడటంతో హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డీసీఎం డ్రైవర్ కావలి చంద్రశేఖర్ (30), కొత్తకోటకు చెందిన గొల్ల నాగన్న మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడిన వారిలో మన్నెమ్మ, కృష్ణయ్య, చంద్రయ్య, వెంకటయ్య, నాగమణి, పద్మ, లక్ష్మి, కురువయ్య, విజయకుమారి, శాంతమ్మ, నాగమ్మ, గోవిందమ్మ, మమత, పార్వతమ్మ, హనుమంతప్ప, మరియమ్మ, చంద్రకళ, తిరుపతమ్మ, వెంకటేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఆళ్లగడ్డ టౌన్ ఎస్‌ఐలు రమేష్‌బాబు, రామాజనేయరెడ్డి పరిశీలించారు. క్యాబిన్‌లో ఇరుక్కున మోహన్‌గౌడు మృతదేహన్ని తొలగించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top