టీడీపీ నేతల దాడిపై గళమెత్తిన జర్నలిస్టులు

టీడీపీ నేతల దాడిపై గళమెత్తిన జర్నలిస్టులు - Sakshi


అనంతపురం జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల ర్యాలీలు ఠ వివిధ పార్టీలు, సంఘాల మద్దతు



సాక్షి, అనంతపురం:  అనంతపురంలో శనివారం సాక్షి ఫొటోగ్రాఫర్ వీరేష్, విలేకరి రమణారెడ్డిలపై టీడీపీ నేతల దాడికి నిరసనగా జర్నలిస్టులు గళమెత్తారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు చేశారు.



వీరికి వివిధ పార్టీలు, సంఘాలు మద్దతు పలికాయి. అనంతపురంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్, కాంగ్రెస్, సీపీఎం, అనంత అభివృద్ధి సాధన కమిటీ, వైఎస్సార్‌ఎస్‌యూ వీరికి మద్దతు తెలిపాయి. జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, హిందూపురం, పెనుకొండలలో  కూడా పాత్రికేయులు ర్యాలీలు చేశారు.

 

‘సాక్షి’ సిబ్బందిపై దాడి కేసులో అరెస్టులు

అనంతపురం క్రైం: అనంతపురంలో శనివారం ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, విలేకరిపై దాడి చేసిన ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మందిని అనంతపురం రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముంటిమడుగు కేశవరెడ్డి, చితంబరి, వెంకటేశు, అమర్‌నాథ్‌రెడ్డి, చిత్రచేడు గోపాల్, నాగరాజు, రామచంద్రారెడ్డి, గోగుల వన్నూరప్ప, ఉప్పర వెంకటరాముడు, శ్రీనివాసులును సీఐ శుభకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరి పాత్రపై విచారిస్తున్నామని సీఐ తెలి పారు. అనంతరం వీరందరినీ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

 

ఏపీ సీఎం ఆంక్షలపై జవదేకర్‌కు ఎన్‌యూజే ఫిర్యాదు

 

సాక్షి, నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌పై ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని వినతి

 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంట్లో అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్‌తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానళ్ల ప్రతిని ధులను అనుమతించక పోవడంపై నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌యూజే- ఇండియా) కేంద్ర సమాచార, ప్రసారాల  శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఫిర్యాదు చేసింది. తక్షణమే జోక్యం చేసుకొని, ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉప్పాల లక్ష్మణ్, ప్రసన్న మహంతి కేంద్ర మంత్రిని కోరారు. ఆంక్షలు ఎత్తివేయకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్రజాస్వామిక చర్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top