ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?

ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?

ప్రకాశం జిల్లా చీరాల గడియారం సెంటర్‌లోని పోలీసు స్టేషన్ ఎదురుగానే ఒక పాత్రికేయుడిని ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా కర్ర పట్టుకుని చితకబాదిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ప్లానింగ్‌తో ముందుగానే ఒక దళితుడిని పోలీసు స్టేషన్‌కు పంపి, అతడితో నాగార్జునరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించి ఆ తర్వాత కొద్ది సేపటికే దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు.. ఇలా ఆమంచి సోదరులు చేస్తున్న అక్రమాలను వెలికితీసి పత్రికలలో రాయడం వల్లే ఈ దాడి జరిగిందన్నది బహిరంగ రహస్యమే అయినా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. దీనిపై తనమీద దాడి జరిగిన ప్రదేశంలోనే జర్నలిస్టు నాగార్జునరెడ్డి సోమవారం ఉదయం ధర్నా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు స్వయంగా తనను కొట్టాడని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉండటంతో.. దీనిపై పోలీసులను 'సాక్షి' ప్రశ్నించగా, పాలేటి రామారావు ఇంటివద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని, ఆ సమయంలో సరిగ్గా ఇక్కడ దాడి జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని తప్పకుండా పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. 

 

స్వతంత్ర సభ్యుడిగా గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 'కాదేదీ దోపిడీకి అనర్హం' అన్నట్లుగా భూమి, ఇసుక, నీరు, బియ్యం, చెట్లు, ప్రజల ఆస్తులు, ప్రజాధనం దేననీ వదలకుండా దోచుకుతింటున్న గజదొంగ అని నాగార్జున రెడ్డి తాను రాసిన 'చీరాలకు చీడపురుగు' కథనంలో పేర్కొన్నారు. 'మట్టిచేతుల బాస' అనే మాసపత్రిక తాజా సంచికలో ఈ కథనం ముఖచిత్ర కథనంగా వచ్చింది. మొత్తం 14 పేజీల స్టోరీ రాశానని, అందులో ప్రతి ఒక్క విషయానికీ పూర్తి ఆధారాలు ఉన్నాయని నాగార్జునరెడ్డి చెప్పారు. దళితులు, గిరిజనుల భూములను ఆక్రమంచి, వాటికి అధికారబలంతో పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదిస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారని కూడా అందులో రాశారు. ప్రశ్నించేవారిపై అక్రమకేసులు బనాయిస్తారని, అడ్డుగా వస్తున్నారనుకున్నవారి ఆస్తులను ధ్వంసం చేసి భయానక పరిస్థితులు సృష్టించి తన పబ్బం గడుపుకొంటారని పేర్కొన్నారు. మచ్చుకి కొన్ని అంశాలు పరిశీలిద్దాం అంటూ.. సుదీర్ఘంగా అక్రమాల చిట్టాను బయటపెట్టారు. దాంతో ఆయనపై దాడి జరిగింది. 


 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top