కలగానే నిరంతర రక్త పరీక్షలు


మంత్రులు, అధికారుల హామీలు హుళక్కేనా?

ప్రభుత్వాస్పత్రిలో రోగుల జేబులకు చిల్లు

బయట ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న రోగులు


 

విజయవాడ(లబ్బీపేట): నగరంలో పెద్దాస్పత్రి పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారింది. పేరుకు బోధనాస్పత్రే కాని, ఇక్కడ సౌకర్యాలు ఏరియా ఆస్పత్రి స్థాయిలో కూడా లేవు. మెరుగైన వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వస్తే నిరాశే మిగులుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట దాటితే రక్తపరీక్షలు చేసేవారు ఉండారు. రూ.వంద లు వెచ్చించి ప్రైవేటు లాబోరేటరీల్లో చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలను మార్చేస్తాం.. సౌకర్యాలు మెరుగు పరుస్తాం అంటూ వంద రోజుల ప్రణాళికలు.. మూడు నెలలు ప్రణాళికలతో ప్రభుత్వం ఊదరగొట్టే ప్రకటనలు మినహా రోగులకు ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇవే నిదర్శనాలు
..

ఏలూరుకు చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అక్కడి జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతనికి అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. సర్జరీకి ముందు హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ, హెచ్‌సీవీ పరీక్షలు చేయాల్సి వుంది. అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట దాటడంతో ల్యాబ్ మూసివేశారు. రూ.వెయ్యి వెచ్చించి ప్రవేటు ల్యాబ్‌లో చేయించారు.

 

రాజీవ్‌నగర్‌కు చెందిన గర్భిణీ ప్రసవం కోసం రాత్రి ఏడు గంటల సమయంలో పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు సిజేరియన్ చేయాలా, సాధారణమా నిర్ధారించేందుకు గైనకాలజిస్ట్‌లు స్కానింగ్ చేశారు. శిశువు పరిస్థితి తెలియలేదు. రేడియాలజిస్ట్‌లు చేయాలి. ఆ సమయంలో ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌లు లేరు. రాత్రివేళ  ప్రవేటు స్కానింగ్‌సెంటర్‌కు పంపాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా వీరిద్దరే కాదు. నిత్యం పదుల సంఖ్యలో రోగులు పడే ఇబ్బందులివి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రభుత్వాస్పత్రిలో రక్తపరీక్షలు అందుబాటులో ఉండవు. అత్యవసర వైద్యానికి 24 గంటల ఆస్పత్రి పనిచేస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒక షిప్టుకే పరిమితం కావడంతో రోగుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.

 

అమలుకు నోచని 24 గంటల పరీక్షలు..


ప్రభుత్వాస్పత్రిలో 24 గంటలు రక్తపరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన కలగానే మిగిలిపోతుంది. ఐదేళ్ల కిందటే నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన చేయగా అది బుట్టదాఖలైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 జూన్ అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలు 24 గంటలు పరీక్షలు తక్షణమే అందుబాటులోకి తెస్తామన్నారు.



వైద్యుల పరిస్థితి దయనీయం..

వైద్యుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ఇక్కడ సౌకర్యాలు లేకుండా బయటకు మందులు, పరీక్షలేమి రాయొద్దని జిల్లా కలెక్టర్, మంత్రులు ఆదేశాలిచ్చారు. ఒకానొక సమయంలో అత్యవసరమైతే బయటి నుంచి రక్తం తీసుకు వచ్చి ఎక్కిస్తే, వైద్యురాలి జీతం నుంచి రక్తం కొనుగోలు చేసిన బిల్లు కట్‌చేయాలని కలెక్టర్ పేర్కొనడంతో వైద్యులు బిత్తర పోయారు. ఇక్కడ సౌకర్యాలు లేనప్పుడు మేమేం చేయాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.  పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే బయటకు ఎందుకు రాస్తామని వారు అంటున్నారు.

 

ప్రభుత్వం స్పందించాలి..

 ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటలు రక్తపరీక్షలు, ఆల్ట్రాసౌండ్ స్కాన్ అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే రోగులకు అన్ని వేళలా మెరుగైన వైద్యం అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top