వామ్మో... కర్నూలా!


డీడీగా వచ్చేందుకు జంకుతున్న అధికారులు?

ఇన్‌చార్జీల పాలనలోనే సాంఘిక సంక్షేమం


 

 హరిప్రసాద్‌ను నియమించినా...


  ఈ నెల 7వ తేదీన ఇక్కడకు రెగ్యులర్ డీడీగా ఎంవీ హరిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన కూడా ఇక్కడకు డీడీగా వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కడప జిల్లా ఎస్‌సీ కార్పొరేషన్‌కు లేదా డీఆర్‌డీఏకు వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కార్యాలయ వర్గాల సమాచారం.

 

కర్నూలు(అర్బన్) : కర్నూలుకు బదిలీ అంటేనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హడలిపోతున్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి డీడీ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన డీడీలు బదిలీ అయిన ఏడాది, ఏడాదిన్నరకు కూడా రెగ్యులర్ డీడీని నియమించని సందర్భాలు ఉన్నాయి. తమకు అనుకూలంగా పనిచేయని అధికారులపై కొందరు పనిగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గతంలో డీడీగా విధులు నిర్వహించిన శోభారాణి ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయిన సందర్భంలో ఆమె ఇంకా అక్కడికి వెళ్లి బాధ్యతలు చేపట్టక ముందే ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. 



అప్పట్లో జరిగిన సన్మాన సభలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగుల్లో సఖ్యత లేక పోవడం, హెచ్‌డబ్ల్యూఓల్లో వర్గ విభేదాలు పొడచూపిన నేపథ్యంలో ఇక్కడకు వచ్చి సమస్యలను తెచ్చుకునేకంటే రాకపోవడమే మేలనే భావనతో పలువురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.



 డీడీ నియామకాల్లో ఎడతెగని జాప్యం...

 వి. జయప్రకాష్ .. 2011 జూన్ 26వ తేదీన బదిలీ అయినప్పటి నుంచి రెగ్యులర్ డీడీ నియామకంలో జాప్యం జరుగుతూనే వస్తోంది. పలు సందర్భాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడకు రెగ్యులర్ డీడీలను నియమించినా, వారు ఏదో ఒక కారణం చూపుతూ.. తమ పలుకుబడిని ఉపయోగించుకొని బదిలీలను రద్దు చేయించుకుంటున్నారు. జయప్రకాష్ బదిలీ అయిన రెండు నెలలకు రిటైర్మెంట్‌కు ఏడాది సమయం ఉన్న బుచ్చయ్యకు 2011 జూలై 21న ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన 2012 ఆగష్టులో రిటైర్డు కాగా, 2013 మే 27వ తేదిన శోభారాణి రెగ్యులర్ డీడీగా బాధ్యతలు చేపట్టి 2014 సెప్టెంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీపై వెళ్లారు.



అప్పటి నుంచి ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జీల పాలనలోనే కొనసాగుతోంది. డీడీ పోస్టు ఖాళీ ఏర్పడిన ప్రతీ సందర్భంలోన ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. జయప్రకాష్ బదిలీ అయిన సందర్భంలో నెల రోజులు, బుచ్చయ్య రిటైర్డు అయి కొత్త డీడీ వచ్చేంతవరకు 8 నెలలు, శోభారాణి బదిలీ అయిన సందర్భంలో ఏడు నెలలు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అయితే పలు కారణాలతో ఇన్‌చార్జీ బాధ్యతల నుంచి సారయ్యను తప్పించి ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ కలెక్టర్ బాలనాయక్‌కు ఆ  బాధ్యతలు అప్పగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top