ఉల్లంఘనులు

ఉల్లంఘనులు - Sakshi


పదవుల కోసం ఎన్నికల్లో జటిల్‌మన్‌ ఒప్పందాలు

అధికారంలోకి వచ్చాక ఉల్లంఘిస్తున్న నేతలు

ఏం చేయలేక చేతులెత్తేస్తున్న మధ్యవర్తులు

పంచాయితీలతో తలలు పట్టుకుంటున్న పెద్దమనుషులు

స్వపక్షం, విపక్షంతోనూ టీడీపీకి పెరుగుతున్న వైరాలు




పదవే పరమావధి... అధికారమే ఆయుధం. ఇదీ ప్రస్తుతం పాలకపక్ష నేతల తీరు. పదవులకోసం అన్ని ఒప్పందాలకూ తలలూపి... తీరా గద్దెనెక్కాక దానినుంచి దిగేందుకు ససేమిరా అంటూ మొండికేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో  మండలాధ్యక్ష పదవులపై జరుగుతున్న ఈ విచిత్ర పరిస్థితివల్ల విపక్షంతోనే గాదు... స్వపక్షంతోనూ విభేదాలు కొనితెచ్చుకుంటున్న సంఘటనలు  చోటుచేసుకుంటున్నాయి.



సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఓడ నడిపే వరకు ఓడ మల్లన్న... ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్న చందాన సాగుతున్నాయి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల ఒప్పందాలు. పదవులు చేపట్టడానికి విపక్షాలతో తెలుగుదేశం పార్టీ జంటిల్‌మన్‌ ఒప్పందాలు దుర్చుకుంది. తీరా పదవి  చేతికొచ్చాక ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పదవిని వదలనంటోంది. జిల్లాలో పలు మండలాల్లో ఇదే పరిస్థితివల్ల విపక్షంతో పాటు స్వపక్షాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎస్‌ కోట నియోజకవర్గంలో జామి మండల ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు జంటిల్‌మన్‌ ఒప్పందాన్ని చేసుకున్నారు.



ముందుగా రెండున్నరేళ్లు ఎస్‌.అప్పయ్యమ్మకు ఎంపీపీ పదవి కట్టబెట్టి ఆ తరువాత రెండున్నరేళ్లు ఇప్పాక చంద్రకళకు ఇవ్వాల్సి ఉంది. ఒప్పంద కాలం పూర్తయినప్పటికీ అప్పయ్యమ్మ రాజీనామా చేయలేదు. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లాలో రెండు సార్లు, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటి వద్ద రెండు సార్లు, మాజీ జెడ్పీ చైర్మన్‌ లగుడు సింహాద్రి ఇంటి వద్ద మరో రెండు సార్లు ఈ విషయంపై పంచాయితీ జరి గింది. కానీ నేటికీ ఒప్పందాన్ని అమలు చేయలేదు. చివరకు ఈ వివాదం రాజధాని వరకూ వెళ్లింది.



ఇరువర్గాలతోనూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి సుజయ కృష్ణ రంగారావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి తీవ్రంగా చర్చించి నచ్చజెప్పారు. ఒప్పందం ప్రకారం పదవివి ఇవ్వాలని వారు చెప్పినాఅప్పటికి సమసినట్టే కనిపించి ఇప్పుడు జటిలంగా మారింది. కేంద్ర మంత్రి అశోక్‌ బంగ్లాలో తాజాగా మరో సారి చర్చలు జరిగినా ఎప్పటిలాగానే మరో వారం తర్వాత తేల్చుతామని ముగించారు. ఈసారీ అది పరిష్కారమయ్యేలా లేదు.



రాజుల ఇలాకాలో...

బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లోని మూడు మండలాల ఎంపీపీ ఒప్పందాలను జూలైలోగా తేలుస్తామని చెప్పిన రాజులు వాటిపై మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆయా మండలాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ప్రస్తుతం బొబ్బిలి టీడీపీ ఎంపీపీగా ఉన్న గోర్జ వెంకటమ్మకు అదే పార్టీకి చెందిన చింతాడ ఎంపీటీసీ తమ్మిరెడ్డి అమ్మడమ్మకు మధ్య జంటిల్‌మన్‌ ఒప్పందాన్ని నాయకులు కుదిర్చారు.



రెండున్నరేళ్లు గడచిపోవడంతో మాట నిలుపుకోమని అడిగే సరికి ఒప్పందాన్ని తెరమరుగు చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్గతంగా వివాదం రగులుతున్నా బయటకు పొక్కనీయకుండా బొబ్బిలి రాజులు జాగ్రత్తపడుతున్నారు.∙తెర్లాం ఎంపీపీగా బోను సావిత్రమ్మకు అవకాశం తరువాత ఇస్తామని నచ్చజెప్పి ముందుగా నర్సుపల్లి పార్వతమ్మకు ఎంపీపీ పదవి ఇచ్చారు. ఇప్పుడు గడువు దాటిపోతున్నా ఆ విషయాన్నే కదపక పోవడంతో పదవి నాశిస్తున్న సావిత్రమ్మ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నారు.



సీతానగరం ఎంపీపీగా పొన్నాడ రామలక్ష్మి వ్యవహరిస్తున్నారు. ఆమె తరువాత రెండున్నరేళ్ల పాటు శనపతి జయలక్ష్మికి ఎంపీపీగా అవకాశమిస్తామని చెప్పిన బొబ్బిలి రాజులు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. దీంతో రెండో వర్గంలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.



భోగాపురంలో విపక్షానికి జెల్ల

భోగాపురం ఎంపీపీ పదవికి తెలుగుదేశం పార్టీకి చెందిన కర్రోతు బంగార్రాజును ఎన్నుకున్నప్పుడు వైఎస్సార్‌ సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా టీడీపీకి మూడేళ్లు, వైఎస్సార్‌సీపీకి రెండేళ్లు ఎంపీపీ పదవిని ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడాయన ఒప్పందమేమీ లేదని బుకాయిస్తున్నారు. కొద్ది రోజులుగా మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడిపినప్పటికీ టీడీపీ కరగకపోవడంతో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. దీంతో సమావేశం నిర్వహించేందుకు కోరం చాలక వాయిదా పడింది. ఒప్పందం ప్రకారం తమకు రెండేళ్లు ఎంపీపీ పదవి ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top