ఈ జన్మభూమి.. టీడీపీదే!

ఈ జన్మభూమి.. టీడీపీదే! - Sakshi


రిమ్స్ క్యాంపస్:‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశము.. నా ఇల్లు అందులోని కమ్మనీ ప్రదేశము’.. అని గతంలో వర్ణించాడో సినీకవి. కానీ ఇప్పుడు జన్మభూమి అంటే.. తెలుగుదేశమేనని అంటున్నారు అధికార పార్టీవారు. గాంధీ జయంతి(గురువారం) నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమ నిర్వహణకు వివిధ స్థాయిల్లో నియమించిన కమిటీలను అధికార టీడీపీ కార్యకర్తలతోనే నింపేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన కార్యకర్తలను సామాజిక సేవకులన్న ముసుగు తొడిగి   కమిటీల్లో నియమించడంతో ఇది ఫక్తు టీడీపీ కార్యక్రమంగా మారిపోయే ప్రమాదముందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, అక్కడికక్కడే వాటిని సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమాన్ని రూపొందించింది.

 

 ఈనెల 2 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించే ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రాంతాల వారీగా అధికారుల ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. ఆయా ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారిని ఈ కమిటీల్లో నియమించాల్సి ఉంది. దీనివల్ల రాజకీయ, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు అవకాశముంటుంది. అయితే ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా కమిటీల నియామకాలు జరిగాయని, ఆ జాబితాలు చూస్తే స్పష్టమవుతుంది. సామాజిక కార్యకర్తల పేరుతో కమిటీల్లో వేసిన వారిలో అత్యధికులు టీడీపీ కార్యకర్తలే. పోనీ మిగతా పార్టీలవారికైనా చోటు కల్పించారా అంటే ఎక్కడా అలా జరగలేదు.

 

 అధికార పార్టీ చెప్పినట్లే..

 ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కమిటీల నియామకం పూర్తిగా రాజకీయ కోణంలో జరిగింది. జిల్లా మంత్రి, విప్, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు సూచించన వ్యక్తులకే కమిటీల్లో చోటు కల్పించారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రతీదీ తమ అదుపాజ్ఞల్లో జరగాలన్న దురుద్దేశంతోనే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెన్షన్ల సర్వే విషయంలోనూ ఇదే విధంగా జరగడంతో రచ్చ అయిన విషయం తెలిసిందే. అయినా ఖాతరు చేయని టీడీపీ నేతలు ‘జన్మభూమి-మాఊరు’ను సైతం తమ పార్టీ కార్యక్రమంగా మార్చేశారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top