స్టాళ్లను సందర్శించిన సీఎం

స్టాళ్లను సందర్శించిన సీఎం


ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :జనధన్ యోజనను ప్రారంభించేందుకు గురువారం స్థానిక చెరుకూరి కల్యాణమండపానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బ్యాంకులు, వివిధ శాఖలకు చెందిన 16 స్టాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్‌కు ముఖ్యమంత్రి వెళ్లి వినియోగదారులకు వారు అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ ఆధీనంలోని మెప్మా ఏర్పాటు చేసిన స్టాల్‌కు వెళ్లి మహిళా రుణాలకు సంబంధించిన ప్రతీ రసీదు ఇకపై తెలుగులోనే అందజేయాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న వీరపండు, దినేష్ అనే విద్యార్థులతోను, పట్టాభిరామయ్య అనే రైతుతోను మాట్లాడారు.

 

 చంద్రబాబుకు మేయర్ వినతి

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నగర మేయర్ పంతం రజనీ శేష సాయి కొన్ని ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందచేశారు. నల్లా ఛానల్ అభివృద్ధి, ఎస్టీపీ ప్లాంట్ వినియోగం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగునకు రూ. 240 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నగరంలో, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇతర గ్రామాలు కలసినా నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు రూ. 170 కోట్లతో పనులు చేసేందుకు జనరల్ ఫండ్ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు. అలాగే కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలన్నారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఉన్నారు.

 ప్రజా ప్రతినిధులందరూ

 

 రాజకీయ పార్టీలకు చెందినవారే

 మధురపూడి:  మన దేశంలో ఏ ప్రజాప్రతినిధి అయినా ఏదో ఒక రాజకీయపార్టీ నుంచి వచ్చిన వారే నని టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ పేర్కొన్నారు. కొందరు సీనియర్ నాయకులను గురువారం విమానాశ్రయంలోకి పోలీసులు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విలేకరులతో గన్ని కృష్ణ మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలకు తనకు ఆహ్వానం కూడా పంపించకపోవడంపై ఆయన  అసంతృఫ్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, లేకపోతే తగిన సమాధానం చెబుతామని ఆయనహెచ్చరించారు. కోనేరు వివేక్, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top