తెరపైకి జంపరకోట


అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావనతో కదలిక

 కొత్త అంచనాలతో పనులకు ఏర్పాట్లు

 ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఎమ్మెల్యేకు లేఖ

 పాలకొండ:
జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. రెండు దశాబ్దాలకుపైగా ఆగుతూసాగుతున్న ఈ రిజర్వాయర్ నిర్మాణంపై కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వాయర్ నిర్మాణ అవసరాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనికిస్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ తీసుకున్న చర్యలపై అమెకు లేఖ పంపించారు.

 1987లో రూ. 2.5 కోట్లతో ప్రతిపాదనలు

 మండలంలోని జంపరకోట గ్రామం వద్ద పెద్దగెడ్డపై 2100 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రిజర్వాయరు నిర్మాణానికి 1987లో ప్రతిపాదించారు. హైదరాబాద్‌కు చెందిన దీపికా

 

 కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. రూ. 2.5 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. అప్పట్లో నిర్వాసితుల అడ్డంకులతో పనులు నిలిచిపోయాయి. సకాలంలో నిర్మాణం జరగకపోవడంతో ధరలు భారీగా పెరిగాయని, కొత్త రేట్లకు అనుమతిస్తేనే పనులు చేపట్టగలమయని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. అనంతరం పలు మార్లు కొత్త అంచనాలతో పనులు ప్రారంభమైనా ముందుకు సాగలేదు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు.

 

  రైతులు మొరపెట్టుకోవడంతో కొత్త అంచనాలు తయారు చేసి రూ.17 కోట్లతో పనులు జరిపించడానికి నిధులు కేటాయించారు. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందటంతో రిజర్వాయరు నిర్మాణం మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికే ఆయన దీని పరిధిలో ఉన్న 45 మంది నిర్వాసిత కుటుంబాలకు ఆర్ ఆర్ ప్యాకేజీని అందించారు. అయినా కాంట్రాక్టరు పనులు సకాలంలో పూర్తి చేయలేదు. వైయస్ మృతితో ప్రాజెక్టు ప్రస్తావన మరుగున పడింది.

 

 అసెంబ్లీలో ప్రస్తావన


 స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. అర్ధంతరంగా నిలిచిపోవడానికి కారణాలను, ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యతకను సభ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిపారుదల శాఖ విభాగం దీనిపై అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో కొత్త ధరలతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.



గతంలో పనులు నిలిపిన కాంట్రాక్టర్‌ను దీనిపై వివరణ కోరడంతో 2014-15 ధరలు ప్రకారం బిల్లులు చెల్లిస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన అంగీకరించినట్లు అధికారులు నివేదించారు. ఈ నివేదిక సారాంశాన్ని ప్రిన్సిపాల్ సెక్రెటరీ నుంచి ఎమ్మెల్యేకు లిఖితపూర్వక లేఖ అందింది. 2016 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్లు తెలిపారు.



 భారీగా పెరిగిన వ్యయం

 ప్రారంభంలో రూ.2.5 కోట్లు వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టు దశలగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే దీనిపై రూ.7 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరో పది కోట్లు విలువ చేసే పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధరల్లో ఈ పనులు రూ.25 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా ఇందు కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం, సిబ్బంది జీతభత్యాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది.  ఇప్పటికైనా సకాలంలో పనులు జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కళావతి కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top