జైలుపాల్జేసిన ఆధిపత్యపోరు

జైలుపాల్జేసిన ఆధిపత్యపోరు - Sakshi


నెల్లూరు(లీగల్): రాజకీయ ఆధిపత్యపోరులో భాగంగా జరిగిన కాంగ్రెస్ నేత మేకల భాస్కరయ్య హత్య కేసులో తీర్పు వెలువడింది. తొమ్మిది మందిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు రూ.6,500 చొప్పున జరిమానా విధిస్తూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సీహెచ్ శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. అనంతరం భారీబందోబస్తు మధ్య ముద్దాయిలను జైలుకు తరలించారు. వీరి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలతో జిల్లా కోర్టు ఆవరణలో ఉద్విగ్నభరితమైన వాతావారణం నెలకొంది. సంగం మండలంలోని మర్రిపాడు ఒకప్పుడు సీపీఎంకు కంచుకోట. మేకల వెంకటరమణయ్య బలమైన నేతగా రెండు దశాబ్దాలుగా గ్రామం లో సీపీఎం కార్యక్రమాలు నిర్విహ స్తూ వస్తున్నాడు. భాస్కరయ్య కూడా మొదట సీపీఎం సానుభూతిపరుడే. అయితే వెంకటరమణయ్య నియంతలా వ్యవహరిస్తుండడంతో గ్రామస్తులు ఆయన నాయకత్వంపై విసుగుచెందారు. ఈ క్రమంలో మేకల భాస్కరయ్య కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తన భార్య పద్మావతమ్మను 2006 ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లోనూ భాస్కరయ్య మద్దతు పలికి న గోసు హజరత్తయ్యకే గ్రామస్తులు సర్పంచ్‌గా పట్టం కట్టారు. పదివార్డు సభ్యుల పదవులు కూడా ఆయన వర్గీయులకే దక్కాయి. క్రమేణా భాస్కరయ్యకు పెరుగుతున్న ఆదరణ చూసి తన నాయకత్వం బలహీన పడిపోయిందని, రాజకీయ ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న అతడిని అంతమొందించాలని వెంకటరమణయ్య నిర్ణయించుకున్నాడు. భాస్కరయ్యపై రెండు సార్లు దాడికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. 2006 ఆగస్టు 23న భాస్కరయ్య ట్రాక్టర్ డీజల్ కోసం బుచ్చిరెడ్డిపాళెం వెళ్లి తిరిగి ఆటోలో గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే భాస్కరయ్య ఇంటి సమీపంలోని బావి సెంటర్ వద్ద మేకల వెంకటరమణయ్య, మేకల జనార్దన్, మేకల శ్రీనివాసులు, నీలపాటి కృష్ణయ్య, గద్దె అశోక్, సమాధి హజరత్తయ్య, వల్లెపు తిరుపతి, పెరుమాళ్లు మల్లికార్జున్, వనమా సుబ్రహ్మణ్యం  కత్తులు, ఇనుప రాడ్లు, మొద్దుకత్తెలతో కాపుకాసి ఉన్నారు. ఆటో అక్కడకు చేరుకోగానే చుట్టుముట్టి భాస్కరయ్యను బయటకు లాగి ఆయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన భార్యను, కొడుకును నెట్టేసి గాయపరిచారు. తీవ్ర రక్తగాయాలైన భాస్కరయ్యను ఆసుపత్రికి తరలించేలోపలే మార్గమధ్యలో మృతిచెందాడు. భార్య పద్మావతమ్మ ఫిర్యాదు మేరకు సంగం పోలీ సులు నిందితులను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. అసెంబ్లీ చర్చలో సైతం ప్రస్తావనకు వచ్చింది. విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతోపై శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ పల్లమాల మోహన్‌రావు కేసు వాదించారు.

 కోర్టు ఆవరణలో మిన్నంటిన రోదనలు

 ముద్దాయిల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో పాటు సీపీఎం నాయకులు కోర్టు వద్దకు చేరుకున్నారు. శిక్షపడిన విషయం తెలియగానే రోదనలతో కోర్టు ఆవరణ మార్మోగింది. ముద్దాయిలను జైలుకు తరలించే సమయంలో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 మర్రిపాడులో పోలీసుపికెట్

 సంగం: భాస్కరయ్య హత్య కేసులో తొమ్మిది మంది సీపీఎం వర్గీయులకు జీవితఖైదు పడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు మర్రిపాడులో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఎస్సై విజయకుమార్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. భాస్కరయ్య హత్య తర్వాత ఐదేళ్ల పాటు గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగింది. పికెట్ మళ్లీ ప్రారంభం కావడంతో పాటు గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రజలు వీధుల్లోకి వచ్చేందుకు జంకుతున్నారు. శుక్రవారం మర్రిపాడు వీధులు బోసిపోయి కనిపించాయి.

 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top