హోదా హోరు

హోదా హోరు - Sakshi


జనసంద్రంగా మారిన గుంటూరు అన్నివర్గాల సంఘీభావం

{పత్యేక హోదా ఆవశ్యకతను చాటిన జననేత ప్రసంగం


 

 

జగన్ నిరవధిక

నిరాహారదీక్షకు ఉవ్వెత్తున తరలివచ్చిన ప్రజలు


 

గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు,  వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా తరలివచ్చారు. గుంటూరుకు వచ్చే దారులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. తమ జీవితాలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను విజయవంతం చేసేందుకు ఎంతవరకైనా పోరాడతామని అన్నివర్గాల ప్రజలు స్పష్టంచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

 

గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఉజ్వల భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దీక్ష చేపట్టిన జగన్‌కు మద్దతు పలికారు. తమ జీవితాలకు భరోసా కలిగించేందుకు చేపట్టిన ఈ దీక్షను విజయవంతం చేస్తామని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతినబూనారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే పారిశ్రామికీకరణ జరిగి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిరుద్యోగులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌తో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి పంట పొలాలకు సాగునీరు అందుతుందని రైతులు భావించి.. తమకోసం పోరాడుతున్న జగన్‌కు మద్దతు ఇచ్చేందుకు గుంటూరుకు తరలివచ్చారు. గత నెల 26న నగరంలోని ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్‌లో జగన్ దీక్ష చేపట్టడానికి నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం కుంటిసాకులతో ఆటంకం కలిగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చేపట్టిన దీక్షకు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో తరలిరావడంతో నగరంలోని ప్రధాన కూడళ్లు కిటకిటలాడాయి. దారులన్నీ గుంటూరు వైపే అనే రీతిలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రజలు వాహనాల్లో తరలిచ్చారు.



 దుర్గమ్మ ఆశీస్సులు పొంది..

 హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బుధవారం ఉదయం విజయవాడ చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి దుర్గమ్మ ఆశీస్సులు పొందారు. అక్కడి నుంచి గుంటూరు బయలుదేరారు. కాకాని వైజంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి పాత గుంటూరులో ఉన్న శ్రీ శారద పీఠం ఆధ్వర్యంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శిబిరం వద్దకు చేరుకున్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన ఐదుగురికి నివాళులు అర్పించి దీక్షను ప్రారంభించారు. అనంతరం జగన్ తన ప్రసంగంలో ప్రత్యేక హోదా సాధనకు గతంలో చేపట్టిన ఉద్యమాలను వివరించారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ప్రత్యేక హోదాతో వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనాలను గణాంకాలతో వివరించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ ప్రసంగం సాగింది.



ప్రత్యేక హోదా వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం గ్రాంటు విడుదల చేస్తుందని, దానిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ గ్రాంట్‌తో పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగు విస్తీర్ణం పెంచవచ్చని వివరించారు. రైతులకు తాగునీటికష్టాలు ఉండవని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనేక రాయితీలు లభిస్తాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివస్తారని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖాండ్, హిమాచల్‌ప్రదేశ్ సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీపైనేఎందుకు ఆసక్తి చూపుతున్నారో వివరించారు. పాలకులు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను వివరించే సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీకి చెందిన ప్రముఖుల ప్రసంగాలకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబును బాహుబలి సినిమాలోని కాలకేయునితో పోలుస్తూ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చేసిన ప్రసంగానికి ప్రజలు హర్షధ్వానాలు పలికారు. పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరు గ్రామానికి చెందిన డి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ద్వారా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివస్తారని, నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారాన్ని నమ్మి టీడీపీకి ఓటు వేశానని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తమలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని పెడన నియోజకవర్గం మణిమేశ్వరం గ్రామానికి చెందిన ఎన్.రాము ఆవేదన వ్యక్తం చేశారు.

 

 గుంటూరు కిటకిట

 జగన్ దీక్షతో గుంటూరు జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వివిధ జిల్లాల నుంచి కార్లు, బస్‌లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో తరలిరావడంతో నగర వీధులన్నీ కిటకిటలాడాయి. నల్లపాడుకు వెళ్లే రోడ్లన్నీ వైఎస్సార్ సీపీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశ య్య, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జులు అన్నాబత్తుని శివ, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర క్రిస్టీనా, హనిమిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నసీర్ అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు, పలు విభాగాల అధ్యక్షులు కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి, మొగిలి మధు, కొత్తా చిన్నపరెడ్డి, కోవూరి సునీల్, సయ్యద్ మాబూ, జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడరు దేవెళ్ల రేవతి, పార్టీ నాయకులు నన్నపనేని సుధ, మహ్మద్ కర్నుమా, కత్తెర సురేష్, జెడ్పీటీసీ సభ్యులు నున్నం సునీత, కొలకలూరి కోటేశ్వరరావు, యేళ్ల జయలక్ష్మి, నాయకులు నూనె ఉమామహేశ్వరరెడ్డి, అంగడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top