ఏడాది ముచ్చటే!

ఏడాది ముచ్చటే! - Sakshi


 జె.బ్రహ్మారెడ్డి... జిల్లా ఎస్పీగా ఏడాదే పనికాలం ఆయనకు ఉగాది పచ్చడిలాంటిది! వచ్చే సాధారణ ఎన్నికల వరకూ జిల్లా పోలీసు బాస్‌గా ఉంటారనే భరోసాతో వచ్చిన ఆయన అనూహ్యంగా వెనుదిరుగుతున్నారు! దీనిపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముక్కుసూటి మనస్తత్వం, ఏకవచన సంబోధన ఆయన పెద్దరికానికి ఇబ్బందిగానే మారాయి! వంశధార నిర్వాసితుల ఆందోళనలకు ఆయన అత్యుత్సాహమే కారణమైందనే విమర్శలు వచ్చాయి. ప్రజల సమస్యలపై వైఎస్సార్‌సీపీ సహా విపక్షాలు ఏ ఉద్యమం చేసినా అణచివేసిన ఆయనే... జిల్లా నుంచి పరిమితికి మించి లక్షలాది లారీల ఇసుకను దోచుకుపోతున్న మాఫియాను కట్టడి చేయడంలో వెనుకంజ వేశారనే ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలనే ఉద్దేశంతో పోలీసుస్టేషన్లకు కొత్త రూపు తీసుకొచ్చినప్పటికీ... ఈ హంగులకు విరాళాల ముసుగులో భారీగా వసూళ్లు చేశారనే అపప్రద పోలీసులపై పడింది.          



సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా ఎస్పీగా గత ఏడాది మే 11వ తేదీన బ్రహ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వచ్చిన వెంటనే ఆయన జిల్లాలో రోడ్డు ప్రమాదాల నిరోధక చర్యలు, ట్రాఫిక్‌ను చక్కదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రైవర్లను అప్రమత్తం చేసే ప్రత్యేక జీబ్రాలైన్లు, వేకువజామున డ్రైవర్లు నిద్రలోకి జారుకోకుండా లారీలను ఆపి నీటితో ముఖాలను కడిగించే కార్యక్రమాలకు నాంది పలికారు. అలాగే జాతీయ రహదారిపై ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ పరిధిలోని డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకూ తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకున్నారు. సంఘటనస్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రతను ఫొటోలు తీసి యాప్‌లో పెట్టాలనే షరతును పక్కాగా అమలు చేశారు. అలాగే ఇచ్చాపురం సహా అంతరాష్ట్ర సరిహద్దు మార్గాల గుండా జిల్లాలోకి వచ్చిపడుతున్న మాదక ద్రవ్యాలకు కట్టడి వేయగలిగారు. మరోవైపు ఎచ్చెర్లలోని ఒక పాఠశాలను దత్తత తీసుకొని పేద విద్యార్థులను చదివించడానికి ఏర్పాట్లు చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.



ఉద్యమాలపై ఉక్కుపాదం...

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందనే నెపంతో చౌదరి తేజేశ్వరరావు వంటి సీనియర్‌ రాజకీయ నాయకుల నుంచి వార్డు స్థాయి నేతల వరకూ ముందస్తు అరెస్టులతో బ్రహ్మారెడ్డి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్సార్‌సీపీ సహా గళమెత్తిన విపక్ష పార్టీ నేతలందర్నీ హౌస్‌ అరెస్టులు చేసి ఉద్యమాలను నీరుగార్చేయడంలో అత్యుత్సాహం చూపించారనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తాయి. వంశధార నిర్వాసితులను బలప్రయోగంతోనైనా తరలించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడి మాటలతో బ్రహ్మారెడ్డి సంఘటనస్థలానికి వెళ్లి నిర్వాసితులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో జనవరి 22వ తేదీన నిర్వాసితులు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు సంస్థల ఆస్తుల ధ్వంసానికి పరోక్షంగా కారణమయ్యారనే విమర్శలు వచ్చాయి.



విరాళాలతో నిర్మాణాలు...

ఇచ్చాపురం నుంచి పైడి భీమవరం వరకూ పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రూపు వంటి కార్యక్రమాలను బ్రహ్మారెడ్డి ఉదృతం చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఈ ఆధునికీకరణ ముసుగులో పోలీసులు భారీగా విరాళాలు సేకరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి రూ.లక్షల్లోనే ఈ వసూళ్ల వ్యవహారం ఉందనే ఆరోపణలు వచ్చాయి. చివరకు ఎస్పీ బంగాళా ఆధునికీకరణ కూడా ఇదే రీతిలో జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణం వల్లే ఏప్రిల్‌ నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ ఎన్‌.సాంబశివరావు... టెక్కలిలో సుమారు రూ.30 లక్షల ఖర్చుతో నిర్మించిన పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆసక్తి చూపించలేదనే వాదనలూ వినిపించాయి.



వివాదాస్పద సంబంధాలు...

పురాతన నాణాల ముఠా, పేకాటరాయుళ్లు, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు, రౌడీషీటర్ల వంటి సంఘవిద్రోహ శక్తులను అణచివేయడానికి బ్రహ్మారెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ వారిలో కొంతమందితో చట్టవ్యతిరేకమైన సంబంధాలు నెరిపారనే ఆరోపణలు ఆయనపై రావడం గమనార్హం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి వెళ్లిన ఇంటెలిజెన్స్‌ నివేదికే బ్రహ్మారెడ్డి అనూహ్య బదిలీకి కారణమయ్యిందనే వాదనలు సొంత శాఖ నుంచే వినిపిస్తున్నాయి. ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వేకెన్సీలో ఉంచడం వీటికి బలం చేకూర్చుతోంది. ఏదిఏమైనా జిల్లా పోలీసుశాఖలో తనదైన శైలితో బ్రహ్మారెడ్డి ఒక ముద్ర వేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top