ఐవైఆర్‌పై అవమానకర వేటు


- బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగింపు

- కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్య నియామకం



సాక్షి, అమరావతి:
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావుకు ఘోర అవమానం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, అర్చక సంక్షేమ సంఘం చైర్మన్‌ పదవుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అర్థంతరంగా తొలగించింది. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పక్కనపెట్టింది. చైర్మన్‌ పదవీ కాలం మూడేళ్లు కాగా, ఆయనను కేవలం ఏడాదిన్నర పాటే కొనసాగించింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చక సంక్షేమ సంఘం చైర్మన్‌ పదవి గురించి ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం గమనార్హం.



టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చిన్న గుళ్లలోపనిచేసే అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపే తుది నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అర్చక సంక్షేమ సంఘం చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న ఐవైఆర్‌ కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నేతల ప్రమేయం లేకుండా చేయడంతోపాటు టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేసి, వాటిని అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టడం వంటివి ఐవైఆర్‌పై సీఎం చంద్రబాబులో అసహనాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు నిధుల విషయమై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఐవైఆర్‌ ప్రయత్నించినా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలు అనూహ్యంగా ఐవైఆర్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్న కొన్ని పాత పోస్టింగులను తెరపైకి తీసుకొచ్చారు. వాటినే సాకుగా చూపి ఆయనను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



కొత్త చైర్మన్‌ హైదరాబాద్‌ టీడీపీ నేత: ఐవైఆర్‌ స్థానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన వేమూరి ఆనంద సూర్య హైదరాబాద్‌ టీడీపీ శాఖలో కీలకంగా పనిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన ఆనంద సూర్య ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్‌ కోసం ఆయన ప్రయత్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top