రైతులకు అండగా ఉంటాం


వెంకటాచలం:  రైతులకు సాగునీరు అందించడంలో అండగా ఉంటామని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మండల పరిధిలోని కంటేపల్లి, ఇడిమేపల్లి, శ్రీకాంత్ కాలనీలో మంగళవారం మంత్రి పర్యటించారు. కంటేపల్లిలో చెరువును, వరి పొలాలను పరిశీలించారు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కనుపూరు కాలువ నుంచి నీరు సరిగా రావడం లేదని తెలిపారు. చెముడుగుంట, కాకుటూరు చెరువుల గుండా ఉప కాలువ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఇడిమేపల్లి గ్రామ చెరువును పరిశీలించి అనంతరం మంత్రి మోటారు బైక్‌పైన రైతులతో ఎనిమిది కిలోమీటర్లు కలసి వెళ్లి ఎండుతున్న పొలాలను పరిశీలించారు.

 

 చెరువు ఆక్రమణపై ఈ సందర్భంగా స్థానిక రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాంత్ కాలనీ వద్ద సర్వేపల్లి రిజర్వయర్ నుంచి ఈదగాలి కాలువ ద్వారా చెరువుకు సాగునీరు అందించేందుకు హార్టు టూ హార్టు సోసైటీ తమ సొంత నిధులతో కాలువను తవ్వించడంపై ఆ సంస్థ నిర్వాహకులు గంగాధర్, జగన్నాథం బాబును మంత్రి అభినందించారు.

 

 రైతులను ఆదుకోవాలి

 40రోజుల్లో 80 శాతం మంది రైతులు కోతలు కోసే అవకాశం ఉందని, దాని వలన నీటి అవసరాలు పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైతులను ఆదుకోవాలని మంత్రి అధికారులను సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, నాయకులు వేనాటి రామచంద్రరెడ్డి, వల్లెపు మునుస్వామి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సమీవుల్లా, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్ పాల్గొన్నారు.

 

 మనుబోలు: ఎండిపోతున్న పంటలకు రెండు రోజుల్లో సాగునీరు అందించి కాపాడుతామని రాష్ట్ర మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మండలంలోని గురివిందపూడి చెరువును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ చెరువు కింద 600 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. చెర్లో చుక్క నీరు కూడా లేదు.  స్పందించిన మంత్రి చెరువుకు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 

  మండలంలోని అన్ని గ్రామాలకు 15 రోజుల్లో సాగునీరు అందిస్తామని తెలిపారు. సోమశిలలో 18 టీఎంసీలు, కండలేరులో 10 టీఎంసీలు నీరు నిల్వ ఉందని తెలిపారు. ఈ నీటిని పొదుపుగా సర్దుబాటు చేసి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కండలేరు నుంచి రెండు చోట్ల పైపు లైన్లు వేసి కనుపూరు కాలువకు నీటిని పారిస్తామన్నారు. ఎంపీడీఓ హేమలత, ఓఎస్‌డీ పెంచల్‌రెడ్డి, మండల నాయకులు సర్వేపల్లి శివకుమార్, మాజీ సర్పంచ్ చెన్నూరు సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top