ప్రేమ..పెళ్లి..పరార్..

ప్రేమ..పెళ్లి..పరార్..


నందిగాం: ఐటీడీఏ ఉద్యోగి ఒకరు ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు రోజులు కాపురం చేసి పరారయ్యాడు. అంతేకాదు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డాడు. దీంతో మోసిపోయినట్టు గ్రహించిన యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే...నందిగాంలోని ఎస్సీ వీధిలోకి చెందిన మట్ట నాగభూషణం (27) ఐటీడీఏలో టైపిస్టుగా పని చేస్తున్నాడు. మందసలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సీతంపేట డిప్యుటేషన్‌పై వెళ్లాడు. అదే వీధిలో నివాసముంటున్న కురమాన కళావతి (25)ని ప్రేమించాడు. ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి శ్రీకాకుళం వచ్చి బలగమెట్టు వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.

 

  ఫిబ్రవరి 17న నందిగాం పోలీసులను ఆశ్రయించి ఇద్దరం మేజర్లం, విశాఖపట్నంలో పెళ్లి చేసుకున్నాం.. పెద్దల నుంచి భయం ఉంది రక్షణ కల్పించాలని కోరారు. అక్కడి నుంచి అదే రోజు శ్రీకాకుళం వెళ్లిపోయారు. మరుసటి రోజు సీతంపేట ఉద్యోగానికి వెళ్లి వస్తానని చెప్పి నాగభూషణం ఇంటి నుంచి బయటకువెళ్లాడు. అప్పటి నుంచి అతగాడు తిరిగి రాలేదు. ఓ రోజు నాగభూషణం ‘మా అమ్మ వల్ల నీ నుంచి విడిపోతున్నాను’ అని కళావతి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టాడు. దీంతో కళావతి ఫిబ్రవరి 24న శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతలో ఈ నెల 27న మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు నాగభూషణం నందిగాం రాగా స్థానికులు పోలీసులు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా బాధితురాలు కళావతి శ్రీకాకుళం ఐద్వా సభ్యులను తీసుకుని నాగభూషణం ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను నిలదీసింది.

 

  మహిళా సంఘ సభ్యులు, నాగభూషణం కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. అప్పటికీ ఆ యువకుడి ఆచూకీ చెప్పకపోవడంతో యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఎస్సై సీహెచ్ ప్రసాద్ వెళ్లి వివాదాన్ని సద్దుమనిగేలా చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలరోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం స్పందించలేదని, ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేసిన వాడిని పట్టుకొని కళావతికి న్యాయం చేయలేదని మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పి.శ్రీదేవి, కె.నాగమణి, పి.ఉష, గణేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు అయిందని.. విచారణ జరుపుతున్నామని స్థానిక ఎస్సై సీహెచ్ ప్రసాద్ చెప్పారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top