‘సుజనాకు క్యాబినెట్ ఇస్తే బాగుండేది’

‘సుజనాకు క్యాబినెట్ ఇస్తే బాగుండేది’ - Sakshi


సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సుజనా చౌదరికి కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తే సముచితంగా ఉండేదని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు ఎం.మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. పార్టీ అభ్యున్నతికి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు. కేంద్ర సహాయమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సుజనా చౌదరిని గురువారం శేషసాయి కళ్యాణ మండపంలో పార్టీ జిల్లా, అర్బన్ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.



ఈ కార్యక్రమానికి పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా అధ్యక్షత వహించారు. అతిథిగా హాజరైన మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబునాయుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో సుజనా చౌదరి పార్టీకి అండగా నిలిచారన్నారు. సుజనా చౌదరిని రాజ్యసభ సభ్యునిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినపుడు తనకు ఎలాంటి పదవులు వద్దని, వేరే వారికి కేటాయించమని చెప్పారన్నారు.



పార్టీ కోసం పనిచేసే మీకు పదవి ఇవ్వటం సముచితం అని చెప్పి చంద్రబాబు ఒప్పించారని వివరించారు. లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ టీడీపీ, బీజెపీ మధ్య పొత్తు కుదర్చటంలో సుజనా చౌదరి కీలకపాత్ర పోషించారన్నారు. టీడీపీని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేశారని కొనియాడారు.



విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, సుజాన చౌదరి తనకు దేవుడిచ్చిన అన్నయ్య లాంటి వాడని అన్నారు. కొన్ని దుష్టశక్తులు తనను టీడీపీ నుంచి బయటకు పంపడానికి ,   ఎంపీ సీటు రాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నించాయన్నారు. ఆ క్రమంలో సుజానా చౌదరి బాసటగా నిలిచారన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో మొదటి నుంచి పని చేస్తున్న వ్యక్తి సుజనా చౌదరి అని కొనియాడారు.



మంత్రి పదవితో ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్టీ ఎంపీ లు ఎస్పీవై రెడ్డి (నంద్యాల), శ్రీరాం మాల్యాద్రి(బాపట్ల), మాగంటి బాబు(ఏలూరు), జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, తంగిరాల సౌమ్య, బోడే ప్రసాద్, శ్రీరాం తాతయ్య, పార్టీ నాయకులు నెట్టెం రఘురామ్, స్వామిదాసు, సుధారాణి, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, మల్లికాబేగం, అనూరాధ, చిగురుపాటి వరప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. అనంతరం పలువురు నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు,  వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు సుజానా చౌదరిని సన్మానించారు.

 

మరింత సేవ చేస్తా  



కేంద్ర మంత్రి పదవి లభించడంతో మరింత సేవ చేసే అవకాశం తనకు దక్కిందని  కేంద్ర   మంత్రి సుజనా చౌదరి అన్నారు. సన్మానం అనంతరం మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవి గుర్తింపు కార్డు లాంటిదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశంలో పలువురిని కలిసి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top