ఇక శిరస్త్రాణ ధారణ తప్పనిసరి


కాకినాడ క్రైం : ద్విచక్రవాహనదారులు శనివారం నుంచి తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలి. దీనిపై ఇప్పటికే పోలీసు, రవాణాశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గత నెల ఒకటి నుంచే హెల్మెట్ ధరించాలని నిబంధన ఉన్నప్పటికీ గోదావరి పుష్కరాల నేపథ్యంలో అమలును ఈనెల ఒకటికి వాయిదా వేశారు. శనివారం నుంచి పోలీసులు, రవాణాశాఖాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ ధరించనివారికి అపరాధరుసుము విధించనున్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల ద్విచక్ర వాహనాలున్నట్లు రవాణా శాఖ అధికారుల అంచనా. హెల్మెట్ ధరించని పక్షంలో రూ.100 అపరాధ రుసుం వసూలు చేయనున్నారు.

 

 రెండు మూడుసార్లు అపరాధ రుసుం చెల్లించి కూడా హెల్మెట్ ధరించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు తీర్మానించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులపై రవాణా, పోలీసు శాఖలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై మరణించే ద్విచక్ర వాహనదారుల్లో 70 శాతం మంది తలకు తగిలే గాయూల వల్లే మృతి చెందినట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైనపుడు మరణాలను తగ్గించడమే లక్ష్యం హెల్మెట్ ధరించాలని నిబంధన విధించినట్లు అధికారులు చెబుతున్నారు.

 

 సిబ్బంది కొరత..

 హెల్మెట్ నిబంధన అమలుకు రవాణా, పోలీసు శాఖల్లో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారింది. జిల్లాలో పూర్తిస్థాయిలో హెల్మెట్ నిబంధన అమలు చేయాలంటే తగినంత సిబ్బంది లేకపోవడంతో ఈనెల ఒకటి నుంచి రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రెండు మూడు నెలల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని యోచిస్తున్నారు.

 

 పోలీసులపై ప్రత్యేకదృష్టి

 పోలీసు అధికారులు, సిబ్బంది హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాకినాడ వన్‌టౌన్, ట్రాఫిక్-2 పోలీసు సిబ్బందికి అధికారులు హెల్మెట్లను ఉచితంగా అందజేశారు. శనివారం నుంచి విధిగా హెల్మెట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అద్దంకి శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ అవగాహన కల్పించారు.

 

 హెల్మెట్ ధరించకుంటే కఠినచర్యలు

 ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాల్సిందే. శనివారం నుంచి జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు అతిక్రమించే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తాం. అయినప్పటికీ స్పందించని పక్షంలో కఠినచర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాల్సిందే. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ద్విచక్ర వాహనదారులు తలకు గాయమై మరణిస్తున్నారు. దీనివల్ల విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన అమలులోకి తెచ్చాం.

 - ఎ.మోహన్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top