8 మద్యం డిపోలకు ఐటీ తాళం

8 మద్యం డిపోలకు ఐటీ తాళం - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపుపన్ను బకాయిలు చెల్లించనందుకు తెలుగు రాష్ట్రాల ఆబ్కారీ శాఖలపై ఐటీశాఖ కొరడా ఝుళిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) 2006 నుంచి 2010 వరకు బ కాయిపడ్డ రూ. 8,000 కోట్ల ఆదాయపు పన్నును వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పానీయాల సంస్థలకు శుక్ర, శనివారాల్లో ఇన్‌కం అటాచ్‌మెంట్ నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ... సోమవారం ఇరు రాష్ట్రాల్లోని ఎనిమిది మద్యం డిపోలను మూసేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న ఆరు మద్యం డిపోలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ, విజయవాడలో ఉన్న రెండు డిపోలను సీజ్ చేసింది. ఐటీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా పీర్జాదిగూడలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బ్రూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐ.ఎం.పి.ఎల్ హైదరాబాద్ డిపో-1ను మూసేసినట్లు చీఫ్ మేనేజర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు.


 


మంగళవారం నుంచి రెండు రాష్ట్రాల్లోని ఇతర మద్యం డిపోలకు కూడా తాళాలు పడే అవకాశం ఉన్నట్లు ఆబ్కారీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకే జమ చేస్తున్నప్పుడు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరమేంటని ఆబ్కారీ శాఖ వాదిస్తుండగా కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఒక సంస్థ చేస్తున్న వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 2006-10 మధ్య జరిగిన లావాదేవీల్లో ప్రత్యేక కార్పొరేషన్ అయిన ఏపీబీసీఎల్‌కే మద్యం అమ్మకాల ఆదాయం సమకూరినట్లు చూపిన కారణం వల్ల ఐటీ శాఖ రూ. 8 వేల కోట్లను పన్ను బకాయిగా నిర్ధరించినట్లు సమాచారం. దీనిపై 2010 నుంచి ఐటీ శాఖ, ఏపీబీసీఎల్ కోర్టులను, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. చివరికు ఐటీ శాఖకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఫిబ్రవరి 27న రెండు రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్‌లకు, బ్రూవరేజస్ కార్పొరేషన్‌లకు నోటీసులు జారీ చేశారు. 28న బకాయిలు చెల్లించకుంటే సీజ్ చేయనున్నట్లు మద్యం డిపోలను హెచ్చరించారు. అందులో భాగంగా సోమవారం ఈ చర్యలు తీసుకున్నారు.

 

 రోజంతా అధికారుల సమాలోచనలు

 

 ఆరు మద్యం డిపోలను ఐటీశాఖ సీజ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఆబ్కారీశాఖ అధికారులు నిర్ఘాంతపోయారు. కమిషనర్ అహ్మద్ నదీం పరిస్థితిని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అదే సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లగా న్యాయపరమైన అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. మూతపడ్డ మద్యం డిపోలను తెరిపించేందుకు మంగళవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

 

 డిపోల వద్ద ఎగబడ్డ మద్యం వ్యాపారులు

 

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని టీఎస్‌బీసీఎల్ డిపోలను మూసివేయడంతో ఇతర జిల్లాల్లో మద్యం వ్యాపారులు అప్రమత్తమయ్యారు.  రాష్ట్రంలోని మిగతా 11 డిపోలలో విక్రయాలు సాగగా అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. తమ జిల్లాల్లోని డిపోలను సీజ్ చేస్తారనే ఆందోళనతో వ్యాపా రులు భారీగా సరుకు కొనుగోలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top