‘ఇసుక'ను మించిన కిరాయి

‘ఇసుక'ను మించిన కిరాయి - Sakshi


సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్వాక్రా గ్రూపులకు రీచ్‌లు కేటాయించినా ఇసుక కొనుగోలు భారంగానే మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు డ్వాక్రా గ్రూపులు ఇసుకు విక్రయిస్తున్నా ట్రాన్స్‌పోర్టు రంగం సిండికేట్ కావడంతో ఇసుక భారం తగ్గడం లేదు. రీచ్‌ల ప్రారంభ దశలోనే ఇలా ఉంటే మున్ముందు ధర ఇంకా పెరగనుందని వ్యాపారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇసుక ధర అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు రీచ్‌లు కేటాయించింది.



     అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొత్త విధానం ఆరంభంలోనే పక్కదారి పడుతోంది.

     జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, తుళ్లూరు, రాయపూడి రీచ్‌లను ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు కేటాయించింది.

     రీచ్ వద్ద క్యూబిక్ మీటరు ఇసుకు రూ.650ల చొప్పున ట్రాక్టరు ట్రక్కు (మూడు క్యూబిక్ మీటర్ల)ను రూ.1950లకు అమ్ముతున్నారు.



     అయితే ట్రాక్టర్ల యజమానులు పది కిలోమీటర్ల దూరానికి రూ.2,500 రవాణా చార్జీ వసూలు చేస్తుండటంతో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక రూ.4500 లకు కొనుగోలు చేసినట్టవుతోంది.

     పది నుంచి 20 కిలోమీటర్ల దూరానికి రవాణా చార్జీలుగా రూ. నాలుగు వేలు వసూలు చేస్తున్నారు. మంగళగిరి, విజయవాడ బెంజి సర్కిల్ వంటి ప్రాంతాల వారు ట్రక్కు ఇసుకను రూ.6 వేలకు కొనుగోలు చేసినట్టవుతోంది.



     తాడేపల్లి మండలంలోనే దాదాపు 100 ట్రాక్టర్లు వరకు ఉన్నాయి. యజమానులు రవాణా చార్జీలను తగ్గించకపోవడంతో ఇసుక కొనుగోలులో పెద్దగా మార్పు రాలేదు.

     ఇసుక ధర కంటే రవాణా చార్జీలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు.

     తుళ్లూరు మండలం రాయపూడి రీచ్ ప్రారంభమైనా, వే బిల్లులు లేకపోవడంతో ఇసుక అమ్మకాలు రెండో రోజు నుంచి నిలిచి పోయాయి.



     రెండు రోజుల్లో ఇసుక అమ్మకాలు ప్రారంభమవుతాయని గ్రూపు సభ్యులు చెబుతున్నారు.

 పక్కదారి పట్టిన నిబంధనలు ...

     ఇసుక ధర తగ్గింపు, రీచ్‌ల వద్ద కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు కేటాయించింది.

     అయితే ట్రాక్టర్ల యజమానుల వల్ల ఇసుక కొనుగోలు భారం తగ్గడం లేదు. అదే విధంగా రీచ్‌ల వద్ద పొక్లయిన్ల వాడకం వల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం లేదు.

     ఉండవల్లి రీచ్‌లో నది నుంచి పడవలపై తీసుకువచ్చిన ఇసుక ను డంపింగ్ యార్డులో నిల్వ చేయాలి. ఈ విధానంలో కార్మికులకు ఉపాధి లభిస్తుంది. పడవల నుంచి తీసుకువచ్చిన ఇసుకను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేయకుండా నేరుగా పడవల నుంచి పొక్లయిన్ సహాయంతో ట్రాక్టరుకు లోడ్ చేస్తున్నారు.

     ఇలా  నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top