విడాకులు ఇస్తావా... చచ్చిపోతావా...

విడాకులు ఇస్తావా... చచ్చిపోతావా... - Sakshi


ప్రొద్దుటూరు క్రైం: నేను రెండో పెళ్లి చేసుకుంటాను... అందుకు ఒప్పుకుని నాకు విడాకులు ఇవ్వు... లేదంటే చచ్చిపో.. అని భర్త తరుచూ భార్యను హింసించేవాడు.  అతని వేధింపులను ఎంతో కాలం ఓర్చుకోలేని భార్య ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకుంది. స్థానిక బంగారయ్య కొట్టాలుకు చెందిన మోరగుడి జయంతి (27) ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న చింతల బాబు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.



అతనికి జయంతితోపాటు అరుణ, పద్మ అనే కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. చిన్న కుమార్తె జయంతికి ఐదేళ్ల క్రితం బంగారయ్య కొట్టాలుకు చెందిన దేవానంద్‌కుమార్‌తో వివాహం అయింది. అతను కొండాపురం తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో జయంతికి కట్నకానుకుల కింద తల్లిదండ్రులు రూ.5లక్షలు ఇచ్చారు.



రెండేళ్లపాటు వారిద్దరు అన్యోన్యంగా ఉన్నారు. వారికి సంతానం కలుగలేదు. దీంతో అతను ఆమెను తరచూ వేధించసాగాడు. మరో మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని, అందుకు విడాకులు ఇవ్వాల్సిందిగా భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. లేదంటే చచ్చిపో అంటూ ఆమెను ఆత్మహత్య వైపు ప్రేరేపించసాగాడు. ఇలా వారి మధ్య గత మూడేళ్ల నుంచి గొడవులు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో శుక్రవారం భర్త కొండాపురానికి డ్యూటీ నిమిత్తం వెళ్లాడు.  



ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో జయంతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు గంట క్రితం జయంతి సోదరి ఫోన్‌లో మాట్లాడగా ఇంకా టిఫిన్ చేయలేదని తెలిపింది. అయితే ఎందుకు టిఫిన్ చేయలేదో తెలుసుకుందామని ఆమె సోదరి అక్కడికి వెళ్లే లోపే జయంతి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చింతల బాబుకు చిన్నకూతురు జయంతి అంటే అమితమైన ప్రేమ. కుమార్తె మరణ వార్త విని అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దేవానంద్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రెడ్డిశేఖర్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top