మేడలపై సాగు

మేడలపై సాగు


పెలైట్ సిటీగా విశాఖ ఎంపిక

తొలివిడతలో 50 బహుళ అంతస్తులపై ప్రయోగం

సీడ్‌తో సహా సబ్సిడీపై యంత్రాలు


 

నగరాలు, పట్టణాలన్నీ కాంక్రీట్‌జంగిల్‌గా మారడంతో పచ్చదనం కనుమరుగైపోయింది. అక్కడక్కడా నీడనిచ్చేమొక్కలే తప్ప ఫలసాయాన్నిచ్చే..ఇంటి అవసరాలకు ఉపయోగపడే మొక్కలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించి పట్టణ ప్రాంతాల్లో సైతం పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది.

 

విశాఖపట్నం: మేడలపై పూల మొక్కలు పెంచుకుంటారు..లేదా ఇం కాస్త వెరైటీగా బోన్సాయ్.. వంటి వినూత్న మొక్కలను పెంచుకుంటా రు. ఇలా ఎవరైనా గార్డనింగ్ హాబీగా చేసుకునే వారే తప్ప మిగిలిన ఇళ్లపై మొక్క కూడా కనిపించడం లేదు.‘ఇంటిపంట’అంటూ కొంతమంది ఉద్యోగ విరమణ చేసిన వారు..ఆసక్తి గల వారు  ఇళ్లల్లో కూరగాయలు, ఇతర రకాల పంటలనుసాగు చేస్తుంటారు. ఇటువంటి వారు నగరాలు, పట్టణాలలో వేళ్లమీదే గుర్తించవచ్చు. ఈ పరిస్థితిని చక్కదిద్ది కాంక్రీట్ జంగిల్‌ను కూడా గ్రీనరీగా మార్చాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఈ వినూత్న ఆలోచనకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కార్యరూపమిచ్చింది. ఇందుకోసం రాష్ర్టంలో పెలైట్ ప్రాజెక్టుగా మహావిశాఖలో అమలు చేయాలని నిర్ణయించింది.



తొలి విడతలో ఈ నెలాఖరులోగా కనీసం 50 బహుళ అంతస్తులపై కూరగాయలు, ఇతర పంటల సాగుచేపట్టాలని సంకల్పించింది. ప్రయోగంమంచి ఫలితాన్ని ఇస్తే మలివిడతలో ఇదేనగరంలో మరో 500భవనాలపై ఈ‘టెర్రాస్‌కల్టివేషన్’ చేపట్టనుంది. ఆ తర్వాత దశల వారీగా నగరంలో ఎంతమంది భవనయజమానులు ఆసక్తి చూపితే అంత మంది భవనాలపై అమలు చేయాలని భావిస్తున్నారు. పూలమొక్కల కంటే కూరగాయల, ఆకు కూరలసాగుకే ప్రాధాన్యతనిస్తారు. ఆసక్తిగల వార్ని గుర్తించి వారికి మేడల సాగుపై ప్రత్యేక శిక్షణనిస్తారు. అలాగే ప్రభుత్వం సీడ్‌తో పాటు రూ.6వేల విలువైన వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్, డ్రిప్‌కాంపోనెంట్స్, పాలీషీడ్స్, మొక్కలు కట్ చేసే కత్తెర్లు 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు.

 

 నిజంగా వినూత్నమైన పథకం

 ఇది నిజంగా వినూత్నమైన పథకం. ఇంటి అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలను ఎవరికివారే పండించుకోవచ్చు. పైగా పచ్చదనంపెరగడం వల్ల పట్టణాలు, నగరాల్లో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించగలం. ఇళ్లపై కూడా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెలైట్ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు 50 మంది ఆసక్తిగల వారినుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.      -ప్రభాకరరావు, ఏడీ, ఉద్యానవన శాఖ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top