శ్రీకాకుళానికి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం!


బొబ్బిలి: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఉమ్మడిగా ఉన్న నీటిపారుదలశాఖ సర్కిల్ కార్యాలయం బొబ్బిలి నుంచి శ్రీకాకుళం తరలిపోవడానికి రంగం సిద్ధమైంది. కొత్త రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయమున్నా శ్రీకాకుళం జిల్లాకు లేదు. దీంతో ఇక్కడి కార్యాలయాన్ని శ్రీకాకుళం తరలించేందుకు ఆ జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అధికార పార్టీ నేతలు గత ఏడాదిగా గట్టిగా యత్నిస్తున్నారు. ఇక్కడి కార్యాలయాన్ని శ్రీకాకుళం తరలిస్తే విజయనగరం జిల్లా సంగతేం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం విశాఖలోని నార్త్‌కోస్టు చీఫ్ ఇంజినీర్ రెండు జిల్లాల్లోని అన్ని విభాగాల ఎస్‌ఈలతో సమావేశం నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లో ఇంజినీరు-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) ప్రత్యేక సమావేశం నిర్వహించన్నారు. సర్కిల్ కార్యాలయం తరలిస్తే ఉద్యోగులకు ఉత్పన్నమయ్యే సమస్యలు, సర్వీసు పరమైన ఇబ్బందుల గురించి ఇందులో చర్చించనున్నారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో దాదాపు 400 మంది ఉద్యోగులుండగా వీరిలో దాదాపు 300 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే.

 

 వాసిరెడ్డి చొరవతో సర్కిల్ ఏర్పాటు

 బొబ్బిలి ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు చొరవతో సర్కిల్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. 1977లో ఏర్పాటైన ఈ కార్యాలయం 1980 వరకు  ఇన్వెస్టిగేషన్ సర్కిల్‌గా పనిచేసింది. 1983 వరకు ఎంఐపీ సర్కిల్‌గా నడిపారు. తర్వాత ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంగా మారింది. ఇప్పటివరకూ 45 మంది ఎస్‌ఈలు పనిచేశారు. 1984లో కార్యాలయానికి పక్కా భవనం నిర్మించారు.

 

 ఇదీ ప్రస్తుత పరిస్థితి

 సర్కిల్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని తోటపల్లి, జంఝావతి, వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ, పెదంకలాం, పెద్దగెడ్డ జలాశయాలున్నాయి. వీటి పనులను ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తున్నారు. సర్కిల్ పరిధిలో ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయి. శ్రీకాకుళంలో సాధారణ డివిజన్, ప్రత్యేక నిర్మాణాల డివిజన్, ప్రత్యేక పరిశోధన డివిజన్, సీతంపేటలో ప్రత్యేక పరిశోధన డివిజన్, రాజాంలో తోటపల్లి డివిజన్ ఉన్నాయి. రెండు జిల్లాల్లో నాగావళి, వంశధార , సువర్ణముఖి, వేగావతి నదులున్నాయి, వీటికి వరదలు వచ్చినపుడు కరకట్టలు తెగిపోవడం, గ్రామాలు మునిగిపోవడం వంటి సమస్యలున్నాయి. బొబ్బిలి నుంచి వీటిని పర్యవేక్షించటం కష్టమవుతుండటంతో శ్రీకాకుళం తరలించాలని ప్రతిపాదించారు.

 

 విజయనగరం జిల్లాకు సర్కిల్ ఉంటుందా?

 ఇక్కడి సర్కిల్ కార్యాలయాన్ని శ్రీకాకుళం తరలిస్తే విజయనగరం జిల్లాలో మరొకటి ఏర్పాటు చేస్తారా?అనేది ఇప్పుడు జిల్లా వాసులను వేధిస్తున్న ప్రశ్న. శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను పర్యవేక్షించటం కష్టమవటమే దీనికి కారణం. ప్రస్తుతం జిల్లా కేంద్రం విజయనగరంలో తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయం ఉంది. దానిలో బొబ్బిలి సర్కిల్‌ను విలీనం చేస్తారని సమాచారం. బుధవారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top